బాణం… తిరిగి పోసుకుంటుందా పాణం..

ఒకప్పుడు కార్మికుల పక్షాన నిలబడి యాజమాన్యాన్ని గడగడలాడించిన గొంతుక అది. తెలంగాణ ఉద్యమంలో సింగరేణికి గుండె చప్పుడై నిలిచిన సంఘమ‌ది… అధికారం చేతికి రాగానే ఆశయాలు పక్కదారి పట్టాయి. నాయకుల అవినీతి, అరాచకాలు తారాస్థాయికి చేరాయి.. ఏ కార్మికులైతే అక్కున చేర్చుకున్నారో వారే ఆ సంఘాన్ని పాతాళానికి తొక్కేశారు. అదే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్). ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన ఈ గులాబీ సంఘం.. స్వయంకృతాపరాధాలతో ఎలా పతనమైంది..? ఇప్పుడు మళ్లీ కార్మికుల దరిచేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా…? సింగరేణిలో టీబీజీకేఎస్ తాజా పరిస్థితిపై ”నాంది న్యూస్” ప్రత్యేక కథనం.

సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలను ఛాలెంజ్ చేసి నిలబడ్డది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS).. ఉద్యమంలో పురుడు పోసుకుని ఇంతింతై వటుడింతై అన్నట్లు ముందుకు సాగింది. ఉద్యమ సమయంలో చేసిన‌ పోరాటాలు, తమ సొంత యూనియన్ అని కార్మికులు అక్కున చేర్చుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంంతో సింగరేణిలో చాలా హక్కులు సాధించుకున్నారు. కానీ, యూనియన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో.. ఆయా ఏరియాల వారీగా నేతలు తమ విశ్వరూపం చూపించారు. ఎక్కడికక్కడ యూనియన్‌ను భ్రష్టుపట్టించే పనులు చేశారు. దీంతో అక్కున చేర్చుకున్న కార్మికులే ఆ యూనియన్ నేతల తీరుపై మండిపడుతూ వారిని వారితో పాటు ఉన్న బీఆర్ఎస్ పార్టీని దూరం పెట్టారు.

పెద్ద ఎత్తున పెరిగిన అవినీతి…
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలవగానే అవినీతి పెద్దఎత్తున పెరిగిపోయింది. కారుణ్య నియామాకాల దగ్గర నుంచి కార్మికుల బదిలీల వరకు, క్వార్టర్ల కౌన్సెలింగ్ అన్ని రకాలుగా ఎక్కడ చూసినా లంచాలు లేనిదే పని కాని దుస్థితి. కారుణ్య నియామాకాల్లో రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూళ్లు చేశారని…. ఇందులో టీబీజీకేఎస్ నేతలే నేరుగా పైరవీలు చేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక బదిలీల విషయానికి వస్తే అందినకాడికి దోచుకున్నారు. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు చొప్పున వసూలు చేశారు. క్వార్టర్ల కౌన్సెలింగ్లో సైతం నాయకులు చెప్పిందే వేదం. వారు చేసిందే చట్టం అన్న విధంగా గనులపై పరిస్థితులు మారాయి.

మహిళా కార్మికులపై లైంగిక వేధింపులు..
మహిళా కార్మికుల పట్ల టీబీజీకేఎస్ నాయకులు వ్యవహరించిన తీరు వివాదాలకు దారి తీసింది. మందమర్రి ఏరియాలో ఓ టీబీజీకేఎస్ నేత కారుణ్య నియామకం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువకుడి భార్యపై కన్నేశాడు. చివరకు ఆమెను లొంగదీసుకోవడంతో విషయం బయటకు వచ్చి పెద్ద రచ్చ జరిగింది. రంగంలోకి దిగిన ట్రీబీజీకేఎస్ నేతలు, బీఆర్ఎస్ నాయకులు యువకుడికి రూ. 30 లక్షల వరకు ముట్టజెప్పి విషయం సద్దుమణిగించారు. వారు కూడా రూ. 10 లక్షల వరకు మింగేశారు. టీబీజీకేఎస్ నేతను షిఫ్టు మార్పించి చేతులు దులుపుకున్నారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ కృష్ణ ఓ నర్సును లైంగికంగా వేధించాడు. విషయం బయటకు పొక్కడంతో నర్సు ఆత్మహత్యాయత్నం చేసింది.

అన్నిచోట్ల అదే దుస్థితి..
ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు వేధింపులకు గురిచేశాడు. ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఆర్జీ 1 ఏరియా వర్క్ షాప్ లో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ ఓ మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశాడు. దీంతో స్వామిదాస్ను తోటి కార్మికుల ఎదురుగానే చెప్పుతో కొట్టింది. విచారణ నేపథ్యంలో రాజీపడాలని, లేకపోతే చంపేస్తామంటున్నారని, సంస్థలో తనకు న్యాయం జరగలేదని ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పుట్టి ముంచిన నేతల తీరు..
సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల వ్యవహారశైలితో అటు టీబీజీకేఎస్ తో పాట బీఆర్ఎస్ పుట్టి మునిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంగా ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో కనీసం ఒక్కటి కూడా గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత, డిసెంబర్ 27, 2023న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ అధిష్టానం భావించింది. దీనికి నిరసనగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి. వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితా యూనియన్ పోటీ చేస్తుందని ప్రకటించినా, అగ్రనేతల రాజీనామా, ప్రచారానికి దూరంగా ఉండటం వంటి కారణాలతో ఆ ఎన్నికల్లో టీబీజీకేఎస్ పూర్తిగా వెనుకబడింది. ఆ ఎన్నికల్లో 11 డివిజన్లకు ఏఐటీయూసీ (AITUC) 5 డివిజన్లు, ఐఎన్టీయూసీ (INTUC) 6 డివిజన్లు గెలుచుకోగా, టీబీజీకేఎస్ ఒక్క డివిజన్లోనూ గెలవలేకపోయింది.

ప్రక్షాళన చేయాల్సిందే..
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల అవినీతి, అరాచక పర్వం విషయాల్లో కార్మికులు ఇప్పటికీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనిని గమనించిన బీఆర్ఎస్ అధిష్టానం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రక్షాళన చేయాలని భావించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల వచ్చిన సందర్భంగా ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా… అయితే, ఇప్పటి వరకు అటు వైపుగా దృష్టి సారించలేదు. ఖచ్చితంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రక్షాళన చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రక్షాళన చేయకుండా… యూనియన్లో మార్పులు చేయకుండా ముందుకు వెళితే ఎలాంటి ఫలితం ఉండదని సింగరేణి కార్మికులు చెబుతున్నారు. యూనియన్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ మార్పులు, చేర్పులు చేయకుంటే కష్టమనే భావన వ్యక్తమవుతోంది.

కార్మికులు ఆదరిస్తారా..?
అయితే, గతం మరిచిపోయి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) కొత్తగా కార్మికుల ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ‘సింగరేణి పరిరక్షణ యాత్ర’ నిర్వహించనున్నారు. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల వైఫల్యం వల్ల కార్మికులు హక్కులు కోల్పోతున్నారని, సంస్థలో ప్రమాదాలు కొనసాగుతున్నాయని, కార్మికుల సంక్షేమం, కంపెనీ పరిరక్షణ కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు మిర్యాల రాజిరెడ్డి చెబుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, కార్మికులు పాతవన్నీ మరిచిపోయి టీబీజీకేఎస్ స్వీకరిస్తారా..? లేకపోతే అదే ఆగ్రహంతో ఆ యూనియన్ దూరం పెడతారా..? వేచి చూడాలి మరి..

You might also like