పత్తి పంట మాటున గంజాయి సాగు!

పత్తి పంట మాటున అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిర్మ‌ల్ జిల్లా మామడ మండలం తండ్ర గ్రామ పరిధిలోని దిన్నస్నాయక్ తండాలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయి మొక్కలను, ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కున్సెట్ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్ల‌డించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 28. 46 ల‌క్ష‌లు అని స్ప‌ష్టం చేశారు.

నిర్మల్ జిల్లా మామడ మండలంలో అక్రమ గంజాయి సాగు కలకలం రేపింది. పత్తి పంటతో పాటు అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మామడ పోలీసులు తండ్ర గ్రామ పరిధిలోని దిన్నస్నాయక్ తండాలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కున్సెట్ రవి (43) అనే వ్యక్తి వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 258 గంజాయి మొక్కలతో పాటు 5.320 కిలోల ఎండిన గంజాయి ఆకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.28 లక్షల 46 వేలుగా అంచనా వేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ గంజాయి సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మాదకద్రవ్యాల అక్రమ సాగు, రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

You might also like