తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
భూ వివాదంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందంటూ ఓ మహిళ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఫ్లోర్ క్లీనర్ మందు తాగి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది.
నిర్మల్ పట్టణంలోని గాజులపేటకు చెందిన యువతిగా బాధితురాలిని గుర్తించారు. భూమికి సంబంధించిన వివాదంలో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఫ్లోర్ క్లీనర్ మందు తాగడంతో అక్కడున్నవారు వెంటనే స్పందించి ఆమెను చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.
భూ వివాదం కారణంగా మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.