బాసరలో అగ్నిప్రమాదం.. పెళ్లి ఇంట తీవ్ర విషాదం
-షార్ట్ సర్క్యూట్తో షేక్ ఇబ్రహీం ఇంట్లో ఎగసిపడిన మంటలు
-రూ. 10 లక్షల నగదు, 4 తులాల బంగారం, పెళ్లి సామాగ్రి పూర్తిగా దగ్ధం
-ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబం
నిర్మల్ జిల్లా బాసరలో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కూతురి పెళ్లి కోసం ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము, బంగారం, సామాగ్రి కళ్లముందే అగ్నికి ఆహుతయ్యాయి. బాసరలోని రవీంద్రపూర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఒక నిరుపేద కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడింది.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో మంటలు క్షణాల్లోనే ఇల్లంతా వ్యాపించాయి. త్వరలోనే షేక్ ఇబ్రహీం కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఖర్చుల కోసం ఇంట్లో ఉంచిన సుమారు రూ. 10 లక్షల నగదు, 4 తులాల బంగారంతో పాటు, నూతన వధూవరుల కోసం కొనుగోలు చేసిన ఫర్నిచర్, విలువైన బట్టలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజిన్తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్థానిక సీఐ దీపక్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కూతురి పెళ్లి కోసం రూపాయి రూపాయి కూడబెట్టిన సొమ్ము, సామాగ్రి కాలిపోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని షేక్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.