కన్న తండ్రే చంపిండు..
-యువతి అనుమానాస్పద మృతి కేసులో సంచలన నిజాలు
-పరువు కోసం కన్నకూతురినే కడతేర్చిన కసాయి తండ్రి
-ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
-నిందితుడు కైలాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన నార్నూర్ పోలీసులు
-వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. తన కూతురి పాలిట కాలయముడయ్యాడు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సిన యువతిని, ప్రేమ వ్యవహారం నచ్చక దారుణంగా హతమార్చాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించిన నిందితుడి గుట్టును నార్నూర్ పోలీసులు రట్టు చేశారు. ఈ సంచలన కేసు వివరాలను ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మీడియాకు వెల్లడించారు.
నార్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్రి గ్రామంలో ఈ నెల 24న అడే కళ్యాణి అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత ప్రచారం జరిగింది. అయితే, కనీసం బంధువులు వచ్చే వరకు కూడా ఆగకుండా, తండ్రి అడే కైలాష్ అదే రోజు ఉదయం మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం స్థానికంగా పలు అనుమానాలకు దారితీసింది. దీంతో నార్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మృతురాలు కళ్యాణికి వివాహం నిశ్చయమై, మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ, ఆమె వేరే వ్యక్తిని ప్రేమిస్తున్న విషయం తండ్రి కైలాష్కు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఈ క్రమంలో కూతురిని అడ్డుతొలగించుకోవాలని పథకం వేసిన తండ్రి.. ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున నిద్రిస్తున్న కళ్యాణి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దానిని ఆత్మహత్యగా నమ్మించేందుకు మృతదేహాన్ని చున్నీతో ఇంటి పైకప్పు దూలానికి వేలాడదీశాడు. ఆ తర్వాత సాక్ష్యాలను మాయం చేసే ఉద్దేశంతో హడావుడిగా దహన సంస్కారాలు పూర్తి చేశాడు. నిందితుడిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 103(1), 238 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అడే కైలాష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో నార్నూర్ సీఐ డి. గురుస్వామి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.