యుద్ధభూమి నుంచి ఇద్దరొచ్చారు..
యుద్దంతో తల్లడిల్లిపోతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు వేగంగా జరుగుతోంది. ఎయిర్‌ఇండియా విమానంలో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చారు. ఆపరేషన్ గంగను వేగవంతం చేసింది కేంద్రం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు యుద్దప్రాతిపదికన జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌కు చెందిన మందనపు స్ఫూర్తి… ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మరో యువకుడు వచ్చారు.
మందనపు స్ఫూర్తి శుక్రవారం తెల్లవారుఝామున స్వగ్రామానికి చేరుకున్నారు. వాస్తవానికి తాను యుద్ధం ప్రారంభం కాకముందే రావాల్సి ఉంది. కానీ రాలేకపోయింది. స్ఫూర్తి జఫ్రోజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఐదో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీ అధికారులు రష్యా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పడంతో తన ప్రయాణం వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. మన దేశానికి చెందిన ఎంబసీ సహకారం మరువలేనిదని స్ఫూర్తి విలేకరులతో చెప్పారు. అధికారులు నిత్యం మాకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించారని వెల్లడించారు. తిండికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నామని స్పష్టం చేశారు. హంగేరీ నుంచి ఎంబసీ అధికారులు దగ్గర ఉండి మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పారు. మన దేశం ఏర్పాటు చేసిన సీ 17 విమానం ద్వారా మన దేశానికి వచ్చానని, ఢిల్లీ నుంచి హైదరాబాద్ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
ఇంటికి చేరుకున్న రోహన్ రెడ్డి..
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రోహన్ రెడ్డి తిరిగి వచ్చారు. ఆయనను బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రధాని నాయకత్వ పటిమ, దౌత్యనీతి వల్ల ఈ రోజు విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, ఉద్యోగులు స్వదేశానికి క్షేమంగా రాగలుగుతున్నారని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది వేల మందిని స్వదేశానికి తీసుకువచ్చారని చెప్పారు. మిగతా వారిని కూడా తరిలిస్తున్నారన్నారు.