ఫోన్ ఊపితే చాలు..! పోలీసులు వస్తారు..
మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఫోన్ చేసే పరిస్థతి లేనప్పుడు కేవలం ఫోన్ ఐదు సార్లు ఊపితే చాలు.. పోలీసులు అక్కడికి వస్తారు.
దిశ ఘటన జరిగిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాయి. దీనిలో భాగంగా మహిళల భద్రతపై జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మహిళలు తమ మొబైల్లో దిశ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.. వారికి ఏదైనా సమస్య ఎదురైతే SOS, చేతిలో ఉన్న మొబైల్‌ను ఐదు సార్లు ఊపితే చాలు భాదితుల దగ్గరకు పోలీసులు చేరుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో 4-5 నిమిషాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 8-10 నిమిషాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దిశ పేరుతో చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించగా.. తాజాగా ఈ దిశ ఫోర్ వీలర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దిశ పెట్రోలింగ్ 163 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. ఈ వాహనాలన్ని జిల్లా యూనిట్ కంట్రోల్ రూం నుంచి నేరుగా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. ప్రత్యేకంగా GPS ట్రాకింగ్ వ్యవస్థతో ఉంటుంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడానికి ఈ పెట్రోలింగ్ వాహనాలు ఉపయోగపడనున్నాయి.. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారు.