ఇన్‌స్టాలో వేధింపులు.. బాలిక బ‌లి..

మంచిర్యాల : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టా గ్రాంలో వేధింపుల‌కు ఓ బాలిక బ‌ల‌య్యింది. ఆ వేధింపుల‌తో 10వ తరగతి బాలిక మ‌ర‌ణించింది. వివ‌రాల్లోకి వెళితే.. ముస్లే సాక్షి (16) అనే బాలిక పేరిట ఇన్‌స్టా గ్రాంలో న‌కిలీ ఐడీలు త‌యారు చేశారు. ఐ వాంట్ జస్టీస్ అంటూ ఆమె పేరు మీద నకిలీ ఐడి తయారు చేశారు. అందులో నుంచి అసభ్యకరమైన సందేశాలు వస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను ఇబ్బందుల‌కు గురిచేసిన వారిని, న‌కిలీ ఐడీలు క్రియేట్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని త‌న సూసైడ్ నోట్‌లో బాలిక సాక్షి పేర్కొంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like