కేసీఆర్ వచ్చిన తర్వాతే సింగరేణిపై దృష్టి
-ఇంటింటికి సంక్షేమ ఫలాలు అందరికీ చేరుతున్నాయి
-ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకువెళ్తోంది
-మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
మంచిర్యాల : ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే సింగరేణిపై ప్రత్యేక దృష్టి సారించారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో 90 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇక్కడ ఇళ్ల పట్టాల గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. అసలు వారికి ఆ ఆలోచనే లేదన్నారు. సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు అందడం నిజంగా అదృష్టమన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. మంచిర్యాలకు మాతా శిశు సంక్షేమ కేంద్రం, అంతర్గాంకు బ్రిడ్జి, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ముందు కూడా అభివృద్ది ఇలాగే కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోటశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.