కర్ణాటక హిజాబ్ వివాదం : పరస్పర విభిన్న తీర్పులు
Karnataka Hijab Controversy: Contrasting Verdicts: తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయింది. 10 రోజులపాటు విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం హిజాబ్ నిషేధంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. హిజాబ్ నిషేధానని జస్టిస్ గుప్తా సమర్థించగా, జస్టిస్ ధూలియా తిరస్కరించారు.
కర్ణాటక రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో యూనిఫాం ధరించాలని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని ఇస్లాం చెప్పిందని కర్ణాటక హైకోర్టు గతంలో తీర్పును వెల్లడించింది. హిజాబ్ ధరించడం తమ ప్రాథమిక హక్కు అని పిటిషనర్లు చెబుతున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
2021 అక్టోబర్ లో ఉడిపిలోని కాలేజీలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ వివాదం పాకింది. యూనిఫాం తప్పనిసరిగా ధరించి రావాలని విద్యాసంస్థ చేసిన సూచనను పాటించలేదు. హిజాబ్ ధరించి కొందరు విద్యార్ధినులు వచ్చారు. దీంతో వివాదం ప్రారంభమైంది. యూనిఫాం లేకుండా వచ్చిన ఆరుగురు విద్యార్ధినులను క్లాస్ రూమ్ లోకి అనుమతించలేదు. విద్యా సంస్థ బయట విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మరోవైపు హిజాబ్ అనుకూలంగా, వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు సాగాయి. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించినా కూడా అనుమతివ్వాలని కోరుతూ హైకోర్టులో విద్యార్ధినులు పిటిషన్లు దాఖలు చేశారు.