కమలంలో కయ్యం
-ఆదిలాబాద్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు
-తాజాగా ఎంపీ సోయం బాపూరావు వీడియో వైరల్
-తమ పార్టీ వారే లీక్ చేసి వైరల్ చేస్తున్నారని ఎంపీ ఆరోపణలు
-అధిష్టానం వద్దే తేల్చుకుంటానని ప్రతిజ్ఞ
-రెండు వర్గాల ప్రచ్ఛన్నయుద్ధం బయటపడిన వైనం
Adilabad: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై కుట్రలు జరుగుతున్నాయా..? సొంత పార్టీ నేతలే అదును కోసం చూస్తున్నారా..? ఎంపీ ల్యాడ్స్ నిధుల ఇవ్వనందుకే ఎంపీని లక్ష్యంగా చేసుకున్నారా..? అందుకే అంతర్గత సమావేశంలో సోయం బాపూరావు మాట్లాడిన మాటలు కావాలనే మోడిఫై చేసి మరీ వైరల్ చేస్తున్నారా..? ఎంపీకి వచ్చిన చిక్కులేంటి..? సొంతపార్టీ నేతలపై ఆయనెందుకు ఆరోపణలు చేయాల్సి వస్తోంది..? ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఎంపీ ల్యాడ్ నిధుల వివాదం రచ్చపై నాంది న్యూస్ కథనం…
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు మాటల మంటలు లేస్తున్నాయి. మండుతున్న ఎండలతో పాటు, ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం బీజేపీ పార్టీలో అంతర్గత చిచ్చు రాజేసింది. ఇక అసలు విషయానికి వస్తే సోయం బాపూరావు నాలుగు రోజుల కిందట ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, జడ్పీటీసీలతో తన నివాసంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీల్యాడ్స్ నిధుల కింద వచ్చే రూ. 5 కోట్లను మీకే ఇస్తున్నానని ప్రకటించారు. పనులు చేయండి… పార్టీకి మంచి పేరు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన తాను ఎంపీగా గెలిచినప్పటి మొదటి ఏడాది కరోనా రావడంతో ఎంపీ ల్యాడ్స్ కింద వచ్చే నిధులు నిలిచిపోయాయన్నారు. ఆ తర్వాత వచ్చిన రెండున్న కోట్లు తన కుమారుడి వివాహం, సొంత ఇంటి నిర్మాణానికి వాడుకున్నా… ఇక నా స్వార్థం కోసం కాదు.. మొత్తం ఐదు కోట్లు మీకే ఇస్తున్నా అంటూ ఆయన ప్రకటించారు. ఇదే క్రమంలో గతంలోని ఎంపీల వ్యవహార శైలిపై కూడా మాట్లాడారు. వాళ్లే తినేవారని కార్యకర్తలు, పార్టీని పట్టించుకోలేదని విమర్శించారు.
అయితే, ఆ ఎంపీ ల్యాడ్స్ నిధులను ఆయన కొందరికి ఇవ్వగా, వారు కమిషన్ ఇచ్చారని ఆ డబ్బులు వాడుకున్నానని చెప్పడం ఆయన ఉద్దేశం. దానిని సైతం కార్యకర్తలకు వివరించారు కూడా. ఎవరూ ఇలాంటి విషయాలు చెప్పరని… కానీ, తాను ఈ విషయాన్ని కార్యకర్తలకు ధైర్యంగా చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు. అందుకే, ఈసారి వచ్చిన రూ. 5 కోట్ల నిధులను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీని ముందుకు నడిపించే వారికి ఇస్తున్నానని కుండబద్దలు కొట్టారు. ఆయన వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తం ఎంపీ ల్యాడ్స్ సోయం బాపూరావు వాడుకున్నట్లుగా ప్రచారం సాగింది. వాస్తవానికి ఎంపీ గృహనిర్మాణానికి కానీ, కుమారుడి వివాహానికి కానీ ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకునే ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎంపీ ఒకవేళ లేఖ ఇచ్చినా పనులకు సంబంధించిన ఆర్డర్ కాపీ, ప్రొసీడింగ్స్ జిల్లా కలెక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది. కలెక్టర్ ఇలాంటి వాటికి నిధులు ఇచ్చే ఆస్కారమే ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన నిధులను సొంతానికి వాడుకున్నా అనే వీడియోను కొందరు నేతలు ఎడిటింగ్ చేసి వేరే అర్దం వచ్చేలా మర్చారని, నిధులు మొత్తం తనే వాడుకున్నట్లు మార్చారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపిస్తున్నారు.
ఎంపీ సోయం బాపూరావు సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తనపై కుట్రలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరో అడుగు ముందుకేసి రమేష్ రాథోడ్ పార్టీలో చేరినప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారని అన్నారు. పాయల్ శంకర్, రమేష్ రాథోడ్ తన పేరు వాడుకుని దందాలు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. తాను నిధులు వాడుకున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఎంపీ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత చిచ్చును బహిర్గతం చేసింది. కొద్ది రోజులుగా ఎంపీ సోయం బాపూరావు వర్సెస్ మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్, పాయల్ శంకర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో సోయం బాపూరావు వీడియో బయటికి రావడం, అది కూడా రెండు మూడు రోజుల తర్వాత వైరల్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇదంతా ఒక్కెత్తు కాగా, ఆ వీడియో పూర్తిగా వెనక నుంచి తీయడం… అది కూడా ఎంపీ ఇంట్లో జరిగిన అంతర్గత సమావేశం అయినప్పటికీ ఆయన మాటలు వైరల్ కావడం పట్ల సోయం అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోనే ఇలా ఉంటే ఎలా అంటూ సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక అధిష్టానం దగ్గరే తేల్చుకుంటానని ఆయన స్పష్టం చేయడం పార్టీలో కలకలం రేగుతోంది. రేపు బండి సంజయ్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్ జరుగుతుండటం, ఎంపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడంతో మరి ఎవరి మీద ఎవరు ఫిర్యాదు చేస్తారు..? చివరికి అధిష్టానం ఏం చెబుతుందన్నదని ఆసక్తిగా మారింది.