ఒక వివాదం… ఎన్నో ప్రశ్న‌లు..

-ఆరిజ‌న్ డైరీ వ్య‌వ‌హారంలో స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లు
-ఎమ్మెల్యే చిన్న‌య్య చెబుతున్న వాటిల్లో వాస్త‌వం ఎంత‌..?
-డైరీ ప్రారంభ స‌మ‌యంలో అది ప్ర‌భుత్వ భూమి అని తెలియ‌దా..?
-నిర్వాహ‌కులు త‌న‌కు ప‌రిచ‌యం లేద‌న్న‌ది వాస్త‌వమేనా..?
-ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కులు సైతం మోస‌గాళ్లేనా..?

MLA Durgam Chinnaiah: కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఆరిజ‌న్ వివాదంలో ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈ విష‌యంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఆరిజ‌న్ సంస్థ చేస్తున్న వాద‌న‌లు వాస్త‌వానికి దూరంగా ఉంటున్నాయి. దీంతో సామాన్యులు ఎవ‌రి మాట‌లు న‌మ్మాలో తెలియ‌క‌, ఏది నిజ‌మో తెలుసుకోలేక‌పోతున్నారు. ఈ వివాదంలో చాలా ప్ర‌శ్న‌లు స‌మాధానాలు లేకుండా మిగిలిపోయాయి.

మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లిలో ఆరిజ‌న్ డైరీ అనే సంస్థ పాల డైరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. అది కాస్తా బెడిసికొట్ట‌డంతో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై ఆరోప‌ణ‌ల‌కు కార‌ణ‌మైంది. ఈ వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని ఆ కంపెనీ డైరెక్ట‌ర్ షెజ‌ల్ ఆరోపించ‌డంతో పాటు అమ్మాయిల‌ను పంపిచ‌మ‌న్నాడ‌ని ఆరిజ‌న్ కంపెనీ నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు సంధించారు. అవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే చిన్న‌య్య ఎదురుదాడికి దిగారు. ఆరిజ‌న్ కంపెనీ ప్ర‌తినిధులు చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆయ‌న అనుచ‌రులు సైతం ఖండించారు.

ఈ వ్య‌వ‌హారంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌ చెబుతున్న విష‌యాల ప‌ట్ల ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఆరిజ‌న్ డైరీ పాల కేంద్రం ఏర్పాటు చేయాల‌నుకున్న‌ది ఓ ప్ర‌భుత్వ భూమిలో. జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని ఉన్నందున దాని విలువ కోట్ల‌లో ఉంటుంది. ప్ర‌భుత్వ భూమిలో ఓ ప్రైవేటు సంస్థ డైరీ ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే ఎలా స‌మ్మ‌తి తెలిపారు. ఎమ్మెల్యే అసైన్డ్ భూముల క‌మిటీకి చైర్మ‌న్‌గా ఉంటారు. మ‌రి అది ప్ర‌భుత్వ భూమి అని ఎమ్మెల్యేకు తెలియ‌ద‌ని అనుకోవాలా..? ఆ భూమి మీ పేరిట చేస్తాన‌ని త‌మ వ‌ద్ద దాదాపు రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు చేశార‌ని ఆరిజ‌న్ నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ చేసిన ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూరుతోంది క‌దా..?\

వివాదం బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత డైరీ నిర్వాహ‌కులు త‌మ‌ను తెలియ‌ద‌ని, కేవ‌లం రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌నే తాను వారిని ప్రోత్స‌హించాన‌ని ఎమ్మెల్యే చిన్న‌య్య చెప్పారు. కానీ, ఆయ‌న ఆరిజ‌న్ డైరీ కేంద్రం ప్రారంభోత్స‌వ స‌భ‌లో త‌న‌కు ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ ఎన్నో ఏండ్ల నుంచి తెలుసున‌ని చెప్పిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాకుండా, ఎమ్మెల్యే పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కులు పెద్ద ఎత్తున హ‌డావిడి చేశారు. ఆ ఫోటోలు సైతం వెలుగులోకి వ‌చ్చాయి. మ‌రి ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కులు త‌న‌కు ముందు తెలియ‌ద‌ని ఎమ్మెల్యే చెప్పింది నిజ‌మా..? త‌న‌కు చాలా రోజులుగా ప‌రిచ‌యం అన్నది వాస్త‌వ‌మా..?

ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కులపై ప‌లు చోట్ల కేసులు న‌మోదు అయ్యాయని ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య చెప్పారు. అది కూడా వివాదం బ‌య‌ట‌కు వ‌చ్చి నిర్వాహ‌కులు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన త‌ర్వాత బ‌య‌ట‌కు వెల్ల‌డించారు. మ‌రి ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి ఒక సంస్థ‌ను ప్రోత్స‌హించేప్పుడు దాని పూర్వ‌ప‌రాలు క‌నీసం కూడా తెలుసుకోలేక‌పోయారా..? తెలిసి కూడా ఎవ‌రెటు పోయినా త‌న‌కేంటి..? అని సైలెంట్‌గా ఉన్నారా..? అన్న‌ది అనుమాన‌స్ప‌దంగా మారింది.

ఇక అమ్మాయుల గురించి చేసిన చాటింగ్ గురించి సైతం ఎమ్మెల్యే మాట్లాడారు. చాటింగ్ త‌న‌ది కాద‌ని ఆ నంబ‌ర్ తో వాట్స‌ప్ తాను వాడ‌టం లేద‌ని చెప్పుకొచ్చారు. కానీ, సోష‌ల్ మీడియాలో చాలా వాట్స్ప‌ప్ గ్రూపుల్లో అదే నంబ‌ర్ న‌మోదు అయ్యి ఉంది. మ‌రి ఆ నంబ‌ర్ వాడుతున్న‌ది ఎవ‌రు..? ఎమ్మెల్యే కాకుండా మ‌రెవ‌రైనా ఆ నంబ‌ర్‌తో వాట్స‌ప్ గ్రూపుల్లో ఉన్నారా..? అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. దానిపై సైతం పూర్తి క్లారిటీ లేదు.

ఇక ఆరిజ‌న్ సంస్థ నిర్వాహ‌కులు సైతం స‌త్త‌పూస‌లేం కాద‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది. రైతుల వ‌ద్ద డ‌బ్బులు తీసుకుని ఎగ్గొట్టేందుకు త‌ప్ప నిజానికి వారు రైతుల‌కు న్యాయం చేసేందుకు కాద‌ని తెలుస్తోంది. సంస్థ మంచి ఆశ‌యంతో పెట్టిందైతే ఒక‌వేళ ఎమ్మెల్యే చేసిన డిమాండ్లు ఎందుకు ఒప్పుకుంటారు..? ఆయ‌న‌కు డ‌బ్బులు ఎందుకు ఇస్తారు..? అని ప‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఎమ్మెల్యే త‌న వ‌ద్ద‌కు అమ్మాయిల‌ను పంపిచ‌మ‌ని చెబితే తాము పంపిచామ‌ని నిర్వాహ‌కుడు ఆదినారాయ‌ణ ఆరోపించారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే చివ‌ర‌కు అమ్మాయిల‌ను పంపించి ప‌ని చేయించుకునేంత అద్భుత సంస్థ అనుకోవాల్సి వ‌స్తుంది క‌దా..? ఇక తాము ల‌క్ష‌ల్లో డ‌బ్బులు ఇచ్చామ‌ని చెబుతున్నారు. మ‌రి డ‌బ్బులు ఇచ్చి ప‌ని చేయించుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది..? అంటే వారు కూడా ఏదో దాస్తున్నార‌నే విష‌యం అర్ధం అవుతుంది.

ఆరిజ‌న్ డైరీ నిర్వాహ‌కులు త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని చెబుతూ సోష‌ల్‌మీడియాలో ఆరోప‌ణ‌లు గుప్పించ‌డం అప్పుడొక్క‌టి అప్పుడొక‌టి వీడియోలు విడుద‌ల చేస్తూ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌పై మాట్లాడుతున్నారు. వీరి వ‌ద్ద మ‌రిన్ని వీడియోలు సైతం ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి అలాంట‌ప్పుడు త‌మ ద‌గ్గ‌ర ఉన్న అన్ని ఆధారాల‌తో కోర్టుకు వెళ్ల‌డం కానీ, పూర్తి ఆధారాలు కానీ బ‌య‌ట‌పెట్ట‌డం కానీ చేయ‌డం లేదు. కేవ‌లం ఈ ఎపిసోడ్ లాగేందుకు మాత్ర‌మే ప్ర‌యత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ఆరిజ‌న్ డైరీ వ్య‌వ‌హారంలో అటు ఎమ్మెల్యే, ఇటు ఆరిజ‌న్ నిర్వాహ‌కులు చెబుతున్న మాట‌ల‌కు ఎన్నో ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. దాదాపుగా ఇవ‌న్నీ స‌మాధానాలు లేని ప‌శ్న‌లే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like