అమ్మాయి పుట్టిందని.. ఏనుగుపై ఊరేగించారు..

అమ్మో ఆడ‌పిల్లా… అయ్యో పాపం ఆడ‌పిల్ల పుట్టిందంటగా.. ఎవ‌రికైనా ఆడ‌పిల్ల పుడితే ఇవీ నిట్టూర్పులు.. కామెంట్లు… ఆడ‌పిల్ల అన‌గానే పురిట్లోనే చంపేసే రోజులివి. కానీ, ఆడ‌పిల్ల పుట్టింద‌ని ఏనుగు అంబారీ మీద ఊరేగింపుగా తీసుకువ‌చ్చి సంబురాలు చేసుకుందో కుటుంబం… అమ్మ‌మ్మ వాళ్లింటిని వ‌చ్చిన ఆ మ‌హాల‌క్ష్మికి క‌నివినీ ఎరుగ‌ని రీతిలో స్వాగ‌తం ప‌లికింది.

గిరిశ్‌పాటిల్‌, సుధ దంప‌తులు మ‌హారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా ప‌చ్‌గావ్‌లో ఉంటున్నారు. వారికి పాప పుట్టింది. పాపకు ముద్దుగా ‘ఐరా’ అని పేరు పెట్టుకున్నారు. ప్రసవానికి పుట్టింటికి వెళ్లిన భార్య, కుమార్తెను గిరీశ్ పాటిల్ తొలిసారిగా శనివారం ఇంటికి తీసుకొచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమెకు గిరీశ్‌ ఘనస్వాగతం పలికాడు. కుమార్తెను ఊరు పొలిమేరల నుంచి ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట కూతురు పుట్టిందని పాటిల్‌ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గిరీశ్ పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీ‌ర్‌గా పనిచేస్తున్నాడు. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి అదిరిపోయే రీతిలో విందు ఏర్పాటు చేశాడు. ఇలా భిన్నమైన రీతిలో ఆడపిల్ల పుట్టడాన్ని స్వాగతించి త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసుకున్నాడు ఆ తండ్రి. గ‌తంలో రాజ‌స్థాన్‌కు చెందిన హ‌నుమాన్, చుకీదేవి దంప‌తులు ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చారు. వారి వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టడంతో సంతోషం వెల్లివిరిసింది. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్ బుక్ చేసి ఔరా అనిపించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like