పులి దాడిలో వ్య‌క్తి మృతి

A man died in a tiger attack: పులి దాడిలో వ్య‌క్తి మృతి చెందిన ఘ‌ట‌న కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వాంకిడి మండలం చౌపన్ గూడ గ్రామ పంచాయ‌తీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన సిడాం భీము (69) అనే వ్య‌క్తి ప‌త్తి చేను కోసం కాప‌లాకు వెళ్లాడు. అత‌నిపై దాడి చేసి కొంత దూరం లాక్కెళ్లింది. దీనిని గ‌మ‌నించిన కొంద‌రు ప‌శువుల కాప‌రులు కేక‌లు వేయ‌డంతో గుట్ట స‌మీపంలో వ‌దిలేసింది వెళ్లింది. భీము అప్ప‌టికే మృతి చెందాడు. ఘ‌ట‌నా స్థలాన్ని అట‌వీ శాఖ అధికారులు ప‌రిశీలించారు.

రెండేళ్ల కింద‌ట ఇదే జిల్లాలో ఇద్ద‌రిపై దాడి చేసిన పులి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను చంపేసింది. 2020 నవంబర్ 11న దహెగాం మండలం దిగిడలో పులి దాడిలో గిరిజన యువకుడు మరణించాడు. దిగిడకు చెందిన యువకుడు సిడాం విఘ్నేశ్ (22) తన మిత్రులు శ్రీకాంత్, నవీన్‌తో కలసి పత్తి చేనులో పత్తి ఏరుతుండగా పొదలమాటున ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసింది. విఘ్నేశ్‌ను నోటకరుచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. పంట చేను సమీపంలోని అటవీ ప్రాంతంలో వెతకగా యువకుడి మృతదేహం లభ్యమైంది.

అదే నెల 29న ఓ యువతిపై దాడి చేసింది. పొలంలో పత్తి చేనులో పనిచేస్తున్న యువతిపై దాడి చేసి చంపేసింది. మృతదేహాన్ని అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మల అనే యువతి పంట చేనులో పత్తి ఏరుతుండగా ఆమెపై పులి దాడి చేసి హతమార్చింది. ఆ తర్వాత ఆమెను అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది. పులి దాడి చేసిన సమయంలో అక్కడే పనిచేస్తున్న ఇతర కూలీలు భయంతో పరుగులు తీశారు. అనంతరం కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. నిర్మల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like