హ‌మ్మ‌య్య‌… ఆ పులి వెళ్లిపోయింది..

-వారం రోజులుగా వ‌ణికించిన మాన్ఈట‌ర్‌
-ప్రాణ‌హిత తీరం దాటి వెళ్లిన‌ట్లు గుర్తించిన అధికారులు

A tiger headed towards Maharashtra: వారం రోజుల పాటు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్ర‌జ‌ల‌కు కంటిమీద కునుకులేకుండా చేసిన పెద్ద‌పులి వెళ్లిపోయిందని స‌మాచారం. అట‌వీశాఖ అధికారులు సైతం దీనిని ధృవీక‌రిస్తున్నారు. ఆ పులి మ‌హారాష్ట్ర వైపున‌కు వెళ్లింద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. దీంతో జిల్లా వాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

కొమురంభీమ్ ఆసిఫాబాద్‌ జిల్లాలో పులి సంచారంతో ప్రజలు తీవ్ర‌ భయాందోళనలకు గురయ్యారు. నిత్యం ఎక్కడో ఒకచోట పులి క‌నిపించ‌డం, అధికారులు సైతం దాని అడుగులు గుర్తించ‌డంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చేనులో ఓ వ్య‌క్తిని సైతం హ‌త‌మార్చ‌డంతో పొలం పనులకు వెళ్లడానికి సైతం జంకారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌, సిర్పూరు (టి), చింతలమానేపల్లి అటవీ ప్రాంతాల్లో పులి ఆన‌వాళ్లను అధికారులు నిర్ధారించారు. ఆ పులి దాడిలో రైతు చనిపోగా.. పదుల సంఖ్యలో పశువులు హతమయ్యాయి. దీంతో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లడానికి కాపర్లు, పత్తి చేన్లకు వెళ్లడానికి రైతులు గ‌జ‌గ‌జ‌వ‌ణుకుతున్నారు.

రైతును చంపిన పులి కాగజ్ నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది ఒకటేనని అధికారులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. ఆ పులి త‌న ఆవాసం కోసం దాదాపు 120 కిలోమీట‌ర్లకు పైగా ప్రయాణం చేసినట్లు అట‌వీశాఖ అధికారులు స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు పులి సంచారంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులు డ‌ప్పు చాటింపుతో పాటు స‌ర్పంచ్‌లకు సైతం చెప్పారు. దీంతో ప్ర‌జ‌లు పంట పొలాలు, కూలీ ప‌నుల‌కు వెళ్ల‌కుండా ఆపేశారు.

ఈ నెల 15 వ తేదీ నుంచి ఆసిఫాబాద్ కొమురంభీమ్‌ జిల్లా లో హల్చల్ చేసిన పెద్ద‌పులి పంట పాలాలు, గ్రామాల్లో సంచరించింది. ఎట్టకేలకు ప్రాణహిత దాటి పొరుగు రాష్ట్రంలోకి వెళ్లినట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం ఉద‌యం దాని పాద ముద్రలను బట్టి అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. బెజ్జూర్‌ మండలం ప్రాణహిత దాటి మహారాష్ట్ర వైపు వెళ్లిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఎట్ట‌కేల‌కు మాన్ ఈట‌ర్ ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ల‌డంతో జ‌నం ఊపిరిపీల్చుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like