రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం

కాంగ్రెస్‌లో ఉంటూనే అధికారపార్టీ ట‌చ్‌లో ఆ ఇద్ద‌రికి చెబితే టీఆర్ ఎస్‌లోకి వ‌స్తానంటూ రాయ‌బారం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించని అధిష్టానం ఊగిస‌లాట‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావు రాజ‌కీయం

రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వ్‌… ఆత్మ‌హ‌త్య‌లే అనేది నానుడి… ఇది మంచిర్యాల ఏఐసీసీ స‌భ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్‌రావుకు స‌రిగ్గా స‌రిపోతుంది. ఆయ‌న ఒక‌ప్పుడు ఆడింది ఆట‌గా పాడింది పాట‌గా మారింది. ఒక ర‌కంగా అన‌ధికార హోం మంత్రిగా కొన‌సాగారంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు అంతా రివ‌ర్స్‌. ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా ప్రేంసాగ‌ర్ రాజ‌కీయ భ‌విత‌వ్యం ఊగిస‌లాట‌లో ప‌డేలా చేస్తోంది. ఇటు కాంగ్రెస్‌లో ఉంటూనే టీఆర్ ఎస్ వైపు చూస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు.. రాష్ట్ర రాజ‌కీయాల్లో చాలా మందికి సుప‌రిచిత‌మైన పేరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఆయ‌న హ‌వా న‌డిచింది. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ఆ త‌ర్వాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో సైతం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయ‌న ఒక ర‌కంగా అన‌ధికార హోం మంత్రిగా కొన‌సాగారు. త‌న‌కు ఉన్న చిరాన్ ఫోర్ట్ క్ల‌బ్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌కు స‌భ్య‌త్వం ఇచ్చి వారితో చాలా స్నేహం కొన‌సాగించేవారు. దీంతో ఆయ‌న ప్రాప‌కం కోసం ఇటు నేత‌లు, అటు పోలీసు ఉన్న‌తాధికారులు ప‌డిగాపులు కాచేవారు. అలా ఎంతో హ‌వా కొన‌సాగించారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో మంచిర్యాల నుంచి సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌రిగిన ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఓడిపోయారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరాలనే కేసీఆర్ ఆహ్వానాన్ని ఆయన అప్పట్లో తిరస్కరించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. ఆ త‌ర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసినా ఆయన్ను చేర్చుకోవడానికి టీఆర్‌ఎస్ జిల్లా ముఖ్యనేతలు మాత్రం వ్యతిరేకించారు. చాలా రోజులు ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. మ‌రోవైపు పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో సైతం ఆయ‌న‌కు దూరం పెర‌గ‌డంతో స్త‌బ్దుగా ఉండిపోయారు.

ఆయ‌న ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా టీఆర్ఎస్ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉంటున్న‌ట్లు స‌మాచారం. గ‌త అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అంతర్గ‌తంగా టీఆర్ఎస్‌కే మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చంద్ర‌శేఖ‌ర్‌కు కాకుండా టీఆర్ఎస్ అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు చెప్పార‌ని కాంగ్రెస్ నేత‌లు బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేశారు. తాను ఓడిపోతాన‌ని ఒక ద‌శ‌లో నిర్ణ‌యానికి వ‌చ్చిన దుర్గం చిన్న‌య్య‌ను ఓట‌మి అంచు నుంచి ప్రేంసాగ‌ర్ రావే బ‌య‌ట‌ప‌డేశార‌ని చెప్పుకుంటారు. ఇలా అన్ని ర‌కాలుగా ఆయ‌న టీఆర్స్ వైపే ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ మ‌ధ్య కాలంలో తాను టీఆర్ ఎస్‌లో చేర‌తాన‌ని త‌న‌కు ఏ ప‌ద‌వులు వ‌ద్ద‌ని అధినేత‌కు ప్రేంసాగ‌ర్ రావు రాయ‌బారం పంపిన‌ట్లు తెలుస్తోంది. సీఎస్ సోమేష్‌కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డికి ఈయ‌న మ‌న మ‌నిషి అనే చెబితే చాలు.. ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆ విష‌యంలో అధిష్టానం నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో ప్రేంసాగ‌ర్ సైలెంట్ అయ్యారు. మ‌రోవైపు ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా కాంగ్రెస్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంద్ర‌వెల్లిలో నిర్వ‌హించిన స‌భ విజ‌య‌వంతం అయిన సంద‌ర్భంగా ఆయ‌న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడుతూ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చినా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని ఆయ‌న చెప్ప‌డంతో ఆశ్చ‌ర్య‌పోవ‌డం కార్య‌క‌ర్త‌ల వంతైంది.

ఇలా ఆయ‌న రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేస్తున్నార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ పార్టీలో ఉంటారో వేచి చూడాల్సిందే. అయితే తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని ప్రాణం పోయినా టీఆర్ ఎస్‌లో చేరేది లేద‌ని ప్రేంసాగ‌ర్ రావు చెబుతుండ‌టం కొస‌మెరుపు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like