ఆ ఆడియో నాది కాదు

ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి

తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని బూతులు తిట్టిన వ్య‌వ‌హారంలో ఆడియో తనది కాదని ఎమ్మెల్సీ పట్నంమహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఐ అంటే తనకు గౌరవం ఉందన్నారు. తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

పోలీసులు తనపై పెట్టిన కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని మహేందర్ రెడ్డి చెప్పారు. ఈ కేసు విషయమై తనకు నోటీసు ఇస్తే స్పందిస్తానని మహేందర్ రెడ్డి వివరించారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందన్నారు. రౌడీ షీటర్ల విషయాన్ని సీఐ వద్ద ప్రస్తావిస్తానని చెప్పారు. కానీ సీఐని బెదిరించలేదన్నారు. సీఐని బెదిరించినట్టుగా ఉన్న ఆడియో తనది కాదని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు పద్దతి ప్రకారం చేయిస్తున్నారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అనుకోకుండా సంఘటన జరిగిందని మహేందర్ రెడ్డి చెప్పారు. ఒకే పార్టీలో ఉంటూ ఈ విషయమై విమర్శలు చేయవద్దని తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఉన్న వారంతా కాంగ్రెస్ నుండి వచ్చారన్నారు. నిజమైన టీఆర్ఎస్ వాదులను కక్ష గట్టి బెదిరింపులకు దిగుతున్నారని మహేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై కేసులు పెడుతున్నారన్నారు. పథకం ప్రకారంగా తమ వారిపై కేసులు పెట్టి అణగదొక్కుతున్నారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విమర్శలు చేశారు. తనకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఏం గొడవో అందరికీ తెలుసునని చెప్పారు. ఎమ్మెల్యే అరాచకాలపై పార్టీ నాయకత్వం చూసుకుంటుంద‌ని వివరించారు. అయితే దీనికి సమయం రావాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలో తాము బలంగా ఉన్నామన్నారు. తన భార్య జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తాను ఎమ్మెల్సీగా తన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్నాడన్నారు. ఇవన్నీ చూసీ ఓర్వలేకనే పథకం ప్రకారం ఇలా చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. తనకే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాననే నమ్మకం ఉందన్నారు. మ‌రోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. తాము లేకపోతే ప్రజా ప్రతినిధులు బయటకు రాలేరన్నారు. ఈ విషయమై ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like