ఆ దూకుడు.. అడ్డెవ్వ‌రూ…

-యువ‌నేత బాల్క సుమ‌న్‌ను అడ్డుకోవ‌డం క‌ష్ట‌మే
-కాంగ్రెస్‌, బీజేపీలో స‌రైన నేత లేక ఇబ్బందులు
-వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే అంటున్న రాజ‌కీయ ప‌రిశీల‌కులు

ఉద్య‌మ నేత‌గా ప్ర‌స్థానం… అధినేత‌కు న‌మ్మిన‌బంటుగా, చెప్పిన ప‌ని చెప్పిన‌ట్టుగా చేసుకువ‌చ్చే నైపుణ్యం.. ఎన్నిక‌లు ఎక్క‌డా జ‌రిగినా పార్టీని ఒంటి చేతితో గెలిపించ‌గ‌ల వ్యూహం.. ఇదీ యువ‌నేత ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ గురించి.. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆయ‌న దూకుడు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

బాల్క సుమ‌న్ యువ‌నేత‌గా జిల్లాకు సుప‌రిచితుడే. చిన్న వ‌య‌సులోనే ఎంపీగా మొద‌లైన ప్ర‌స్థానం.. చెన్నూరు ఎమ్మెల్యేగా, ప్ర‌భుత్వ విప్‌గా ఇప్పుడు జిల్లా టీఆర్ఎస్ అద్య‌క్ష ప‌ద‌వి ఇలా కొన‌సాగుతోంది. ఆయ‌న కేవ‌లం ప్ర‌జాప్ర‌తినిధిగానే కాదు.. ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్ప‌గ‌ల నేత‌గా కూడా చాలా పేరుంది. సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లో శ్రీ‌రాంపూర్ ఏరియాలో వాస్త‌వానికి తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఓడిపోవాల్సి ఉండే. కానీ ఆయ‌న త‌న చ‌తుర‌తో యూనియ‌న్‌ను గ‌ట్టెక్కించారు. ఒక‌వేళ ఇక్క‌డ ఓడిపోతే ఖ‌చ్చితంగా గుర్తింపు సంఘం హోదా కోల్పోయి ఉండేది. ఇక ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో సైతం చెన్నూరులో మిగ‌తా పార్టీల‌కు చుక్క‌లు చూపించారు. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌రూ త‌న దరిదాపుల్లో లేకుండా చేయ‌గ‌లిగారు. ఆయ‌న ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా…

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు మిన‌హా చెప్పుకోద‌గ్గ నేత ఎవ‌రూ లేరు. దూకుడు గ‌ల నేత‌గా ఆయ‌న‌కు పేరుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న ప‌నితీరు వివాస్ప‌దంగా మారుతోంది. దీంతో చాలా మంది పార్టీని వీడుతున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు అస‌మ్మ‌తి కూడా ఎక్కువే. ఇప్పుడు ఆయ‌నకు షోకాజ్ నోటీసు, వీహెచ్ వ్య‌వ‌హారం త‌లనొప్పిగా మారింది. ఇక ఆయ‌న మిన‌హా పార్టీలో చెప్పుకోద‌గ్గ నేత లేరు. చెన్నూరు, బెల్లంప‌ల్లిలో స‌రైన అభ్య‌ర్థే లేరు. అక్క‌డ నేత‌లు ఎవ‌రూ ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే స్థాయిలో లేరు. మ‌రి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దూకుడుకు అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌రా..? అంటే ఖ‌చ్చితంగా కాద‌నే స‌మాధాన‌మే వ‌స్తుంది.

ఇక బీజేపీ నేత‌ల ప‌రిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. అందులో కూడా పార్టీని ఏక‌తాట‌పై న‌డిపించే వారు లేరు. బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్ రావు పార్టీని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో పూర్తి స్థాయిలో విఫ‌ల‌మ‌య్యారు. ఉన్న న‌లుగురు నేత‌ల్లో మూడు గ్రూపులు అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. మ‌రోవైపు ర‌ఘునాథ‌రావు కూడా జిల్లా కేంద్రం దాటి బ‌య‌ట‌కు రారు. అలాంట‌ప్పుడు పార్టీ గెలుపు ఎలా సాధ్య‌మ‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక మిగ‌తా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం భార‌తీయ జ‌న‌తా పార్టీకి స‌రైన అభ్య‌ర్థి లేని దుస్థితి. రాష్ట్ర స్తాయిలో పార్టీని ప‌రుగులు పెట్టిస్తుంటే ఇక్క‌డ మాత్రం బీజేపీ స్త‌బ్ధుగా ఉంది.

టీఆర్ఎస్ అధికార పార్టీ. అంగ‌బ‌లం, అర్ధ‌బ‌లం ఉన్నాయి. దానికి తోడు యువ‌నేత బాల్క సుమ‌న్ దూకుడు. మిగ‌తా రెండు పార్టీలు ఆయ‌న దూకుడు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. బాల్క సుమ‌న్ సైతం పార్టీ బ‌లోపేతం, పార్టీలో మిగ‌తా విభాగాల‌ను ప‌టిష్టం చేసేందుకు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇలా అన్ని ర‌కాలుగా ఆ పార్టీ దూసుకుపోతుంటే మిగ‌తా పార్టీలు నైరాశ్యంలో మునిగాయి. టీఆర్ ఎస్ పార్టీని త‌ట్టుకోవాలంటే ఖ‌చ్చితంగా ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే ఖ‌చ్చితంగా టీఆర్ ఎస్ దూకుడుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like