ఆ నేత‌ల‌కు బంప‌రాఫ‌ర్‌..

ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు ముట్ట‌జెప్పేందుకు ఆలోచ‌న - ఉమ్మడి జిల్లాలో మొదలైన టీఆర్‌ఎస్‌ క్యాంపు రాజకీయం - ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లకు ఎమ్మెల్యేల ఫోన్లు - 750 మంది ప్రజాప్రతినిధుల తరలింపునకు ప్లాన్ - ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార పార్టీ ముందస్తు వ్యూహం

అస‌మ్మ‌తి నేత‌ల‌ను బుజ్జ‌గించే కంటే మ‌న వాళ్ల‌కే ఎంతో కొంత ముట్ట‌జెబితే పుణ్యం పురుషార్థం రెండూ ద‌క్కుతాయి క‌దా..? ఇదీ టీఆర్ ఎస్ అధిష్టానం ఆలోచ‌న‌. అందుకే త‌మ వారిని క్యాంపున‌కు తీసుకువెళ్లి డ‌బ్బులు ముట్ట‌జెప్పి వారికే న్యాయం చేయాల‌ని నేత‌లు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ మేర‌కు అంతా సిద్ధం చేశారు.

ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేసన్ల ఘట్టం ముగియడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ త‌మ అభ్య‌ర్థిని గెలిపించుకునే ప‌నిలో వ్యూహం ర‌చిస్తోంది. ఇప్ప‌టికే అన్ని ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుని ముందుకు వెళ్తోంది. ఒకే ఎమ్మెల్సీ స్థానానికి 24 మంది అభ్యర్థులు 30 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. బుధవారం ఎన్నికల అధికారులు పరిశీలన అనంతరం వేసిన నామినేషన్లన్నీ సక్రమంగానే ఉన్నాయని ప్రకటించారు. ఒక అభ్య‌ర్థి త‌న నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో ఎన్నిక అనివార్యం కానుంది.

మ‌న వాళ్ల‌కే డ‌బ్బులిద్దాం…
ఎమ్మెల్సీ స్థానం కోసం నామినేషన్‌ వేసిన వారందరికి డ‌బ్బులు ఇచ్చి వారిని ఎన్నికల బరిలో నుంచి తప్పించడం కష్టమేన‌ని నేత‌లు భావిస్తున్నారు. 23 మంది స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడం అంత సులువైన పనేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగించే బదులు తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అన్నిరకాలుగా ఆదుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 937 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 750 మంది వ‌ర‌కు టీఆర్ ఎస్‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు ఉన్నారు. వీరంద‌రికీ రూ.లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు గుడ్‌విల్‌ ఇచ్చేందుకు భారీ బడ్జెట్‌ ప్లాన్‌ కూడా చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది.

ఛ‌లో.. ఛ‌లో.. క్యాంపు..
ఇక్క‌డ ఉన్న నేత‌ల‌ను సైతం వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు అధికార పార్టీ సిద్ద‌మ‌య్యింది. ఇప్పటికే మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్‌, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్‌, పలువురు ఎమ్మెల్యేలు క్యాంపు ఏర్పాట్లపై మంతనాలు జరిపారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క్యాంపునకు తరలించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నిక క్యాంపు బాధ్యతలు ఎమ్మెల్యేలదేనని పార్టీ అధిష్ఠానం హెచ్చ‌రించింది. దీంతో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు కూడా క్యాంపునకు తరలివెళ్లే అవకాశముంది. ఎమ్మెల్యేలే స్వయంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిర్లకు ఫోన్‌లు చేసి మాట్లాడారు. గురువారం రాత్రి వరకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడి నుంచి వేరే ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్ల‌నున్నారు. ప్రతీ రెండు, మూడు రోజులకోసారి క్యాంపును మార్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

పాపం వారికి షాకేనా..?
త‌మ‌కు ప్ర‌భుత్వం న్యాయం చేయ‌డం లేద‌ని నిధులు, విధులు క‌ల్పించ‌డం లేద‌ని చాలా మంది నామినేష‌న్ వేశారు. అయితే మ‌రికొంత మంది మాత్రం ఎంతో కొంత క‌లిసివ‌స్తుంద‌ని నామినేష‌న్ దాఖ‌లు చేశారు. టీఆర్ ఎస్ వారికి షాక్ ఇచ్చింది. వారిని ప‌ట్టించుకోవద్ద‌నే నిర్ణ‌యం తీసుకుంది. దీంతో అనుకున్న‌ది ఒక్క‌టి.. అయ్యింది ఒక్క‌ట‌ని వారు వాపోతున్నారు. అదే స‌మ‌యంలో త‌మ‌కు కూడా అంతో ఇంతో లాభం చేకూరుతుంద‌ని కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌జాప్ర‌తినిధులు భావించారు. వారిని కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ ఎన్నిక ద్వారా ల‌బ్ధిపొందాల‌న్న వారి ఆశ కూడా ఆడియాశే అయ్యింది. నామినేషన్ల ఉప సంహరణకు మరో రెండు రోజుల సమయం ఉండడంతో కొంత వేచిచూసే ధోరణితోనే టీఆర్‌ఎస్‌ నేతలు కనిపిస్తున్నారు. ఎంత మంది తప్పుకుంటారు? బరిలో ఎవరెవరు ఉంటారు? అనే విషయమై వేచి చూడాల్సిందే మరీ..!!

క్యాంపు వెళ్లేందుకు నిరాస‌క్త‌త‌..
మ‌రోవైపు క్యాంపు వెళ్లేందుకు చాలా మంది నిరాస‌క్త‌త చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక తప్పదేమోనన్న భయం టీఆర్‌ఎస్‌ను వెంటాడుతున్న నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా క్యాంపు వెళ్లాల‌ని ఎమ్మెల్యేలు చెబుతున్న త‌రుణంలో కొంద‌రు తాము రామ‌ని చెబుతున్నారు. డిసెంబర్‌ 10న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. ప‌దిహేను రోజుల ముందు క్యాంపు వెళ్లేందుకు కొందరు ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుండగా.. మరికొందరు తమ సొంత వ్యాపారం పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ప‌దిహేను రోజులు క్యాంపు వెళ్లడమంటే కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like