ఆ రైలు నిర్మాణానికి ప‌చ్చ‌జెండా

కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్‌ కోసం సింగరేణి చివరి విడత మొత్తం రూ. 62.17 కోట్ల చెక్కు అందించింది. సింగరేణి తనవంతుగా ప్రాజెక్టు కోసం మొత్తం రూ.618.55 కోట్లు చెల్లించింది. సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వేలైన్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తద్వారా బొగ్గు రవాణా సులభతరం అవుతుందని అల్విన్‌ కోరగా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే జీఎం హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కోల్‌మూమెంట్‌) జె.అల్విన్‌, జీఎం (కోఆర్డినేషన్‌,మార్కెటింగ్‌) సూర్యనారాయణ, జీఎం(సివిల్‌) రమేశ్‌బాబు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యాను కలిసి చెక్కును అందజేశారు.

సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ చొరవతో అంకురార్పణ
కొత్తగూడెం ఏరియా సత్తుపల్లిలో ఉపరితల బొగ్గు గనులు ప్రారంభమైన నేపథ్యంలో పర్యావరణ హితంగా బొగ్గు రవాణా చేయాలని సీఅండ్ఎండీ ఈ రైల్వే లైన్ ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. నాలుగేళ్ల కింద‌టే సత్తుపల్లి -కొత్తగూడెం రైల్వే లైన్ ప్రారంభించాలని రైల్వే శాఖను కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ సంయుక్త భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సవరించిన అంచనాల మేరకు రైల్వే లైన్‌ నిర్మాణానికి రూ. 927 కోట్ల వ్యయం అవుతుండగా సింగరేణి వాటాగా రూ.618.55 కోట్లు, రైల్వే శాఖ రూ.309.3 కోట్లు భరించాలని నిర్ణయించారు.ఈ మేరకు సింగరేణి విడతల వారీగా గతంలో రూ.556.38 కోట్లను చెల్లించింది. శుక్రవారం రూ.62.17 కోట్ల చెక్కు అంద‌చేయ‌డంతో తన వాటా చెల్లించిన‌ట్ల‌య్యింది.

రైలు మార్గంతో పర్యావరణ హితం.. తక్కువ వ్యయంతో బొగ్గు రవాణా
ప్రస్తుతం సత్తుపల్లి గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌ కోల్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంట్ కు లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇక్కడ రోజుకు ఉత్పత్తి అయ్యే దాదాపు 30 వేల టన్నులను లారీల ద్వారా తరలించడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది క‌లుగుతోంది. అంతేకాకుండా రవాణా వ్యయం కూడా అధికం అవుతుంది. అదే 53 కిలోమీటర్ల సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ పూర్తయితే పర్యావరణహితంగా, తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా అవుతుంది.

సింగరేణి సహకారంతో త్వరితగతిన రైల్వే లైన్‌ : సౌత్‌ సెంట్రల్‌ రైల్వేస్‌ జి.ఎం.
రైల్వే శాఖ – సింగరేణి సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సింగరేణి నుంచి తమకు సంపూర్ణ సహకారం లభించింద‌ని రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తెలిపారు. అందుకే నిర్మాణ పనులను వీలైనంత వేగంగా పూర్తి చేశామ‌న్నారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణం, ఇతరత్రా పనుల్లో సింగరేణి అన్ని విధాలుగా సహక‌రించ‌డం ప‌ట్ల కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ సమయంలో భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టు ఇదేనన్నారు. తొంద‌ర‌లోనే రైల్వే లైన్‌ పనులు పూర్తై అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like