ఆదిలాబాద్‌లో పరువు హత్య..

తెలంగాణలో పరువు హత్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. ఒక ఘటన గురించి మరిచిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంటోంది. ప్రేమించి పెళ్లిచేసుకున్న పాపానికి కన్నబిడ్డలు, తోబుట్టువులనే అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన జంటలకు జీవితమే లేకుండా చేస్తున్నారు. మొన్నటికి మొన్న సరూర్‌నగర్‌,బేగంబజార్‌ ఘటన నుంచి తేరుకోకముందే ఆదిలాబాద్‌లో మరో ఘోరం జరిగింది.

నార్నూర్‌ మండలం నాగలకొండలో ప్రేమపెళ్లి చేసుకుందని కన్న కూతురినే తల్లిదండ్రులు హత్య చేశారు. రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లి నిరాకరించడంతో.. నెల కింద‌ట‌ ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. దీంతో తమ మాట కాదని వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పరువు తీసిందని కూతురిపై తల్లిదండ్రులు పగ పెంచుకున్నారు. ఈ క్రమంలో కన్న కూతురిని కూడా చూడకుండా శుక్రవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపారు.

ఇటీవల పంచాయితీ…!
వీరి ప్రేమ పెళ్లి విషయంపై పంచాయితీ పెట్టినట్లు సమాచారం. రెండు వారాల క్రితం మాట్లాడిన పెద్దలు ఇద్దర్నీ విడదీసినట్లు తెలుస్తోంది. అయితే ప్రేమించిన వ్యక్తే కావాలంటూ తండ్రితో కుమార్తె గొడవకు దిగింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like