ఆధునిక సాంకేతికత వినియోగిస్తూ దేశాభివృద్ధికి దోహదపడాలి

భారత మైనింగ్‌ డే సందర్భంగా ఛైర్మన్‌ అండ్‌ ఎం.డి. శ్రీధర్‌ శుభాకాంక్షలు

భూగర్భంలో దాగిఉన్న అపారమైన ఖనిజ నిల్వలను దేశాభివృద్ధికి అందించడంలో మైనింగ్‌ విభాగం ఇంజనీర్లు, అధికారులు, కార్మికులకు కీలకపాత్ర పోషిస్తున్నారనీ, దేశ ప్రగతి కోసం రానున్న కాలంలో మరింత విస్తృతంగా, సమర్ధంగా వీరు తమ సేవలను అందించాల్సి ఉంటుందని సింగరేణి సి అండ్‌ ఎం.డి. శ్రీ శ్రీధర్‌ తెలిపారు. సోమవారం (నవంబర్‌ 1వ తేదీ) నాడు భారత మైనింగ్‌ డే సందర్భంగా ఆయన మైనింగ్‌ విభాగం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

అన్వేషణ, ఉత్పత్తి, సమర్ధ వినియోగం అనే లక్ష్యాలతో మైనింగ్‌ కొనసాగాలనీ, భూగర్భంలో దాగిన ఖనిజ నిల్వలు బయటకుతీయగలిగినప్పుడే సార్ధకత చేకూరుతుందన్నారు. 2019 లెక్కల ప్రకారం ఇనుప, క్రొమియం ఖనిజ ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో 4వ స్థానంలో ఉందనీ, జింక్‌, బాక్సైట్‌ ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉందని అలాగే 2015 లెక్కల ప్రకారం బొగ్గు ఐరన్‌ నిల్వలలో ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉందనీ, ఈ నిల్వలను జాతి అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకొని, మన దేశ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకొంటూ, సమర్ధంగా ఖనిజ నిల్వలను వెలికి తీయాల్సిన అవసరం ఉందనీ, ముఖ్యంగా దేశ విద్యుత్‌ అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బొగ్గు సంస్థల వారు తమ సామర్ధ్యాలను పెంచుకొంటూ బొగ్గు ఉత్పత్తులను సాధించాలని కోరారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మైనింగ్‌ ఇంజనీర్లు, ఉద్యోగులకు తన శుభాకాంక్షలు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like