ఆప‌ద‌లో నుంచి.. ఆదుకునే వ‌ర‌కు..

-నేడు కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుద‌ల‌
-వ‌ర‌దల‌తో కొట్టుకుపోయే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ క‌డెం ప్రాజెక్టు
-యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు పూర్తి చేసిన ఇంజ‌నీరింగ్ అధికారులు
-నీటిని విడుద‌ల చేయ‌నున్న ఎమ్మెల్యేలు

క‌డెం ప్రాజెక్టు ఆయ‌క‌ట్టు రైతుల‌కు అధికారులు శుభ‌వార్త చెప్పారు ఇరిగేష‌న్ అధికారులు… శుక్ర‌వారం నీటిని విడుద‌ల చెప్ప‌డంతో అన్న‌దాత‌ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అస‌లు ప్రాజెక్టు ఉంటుందా..? కొట్టుకుపోతుందా..? అనే ప‌రిస్థితి నుంచి రైతుల‌కు నీరందిస్తుండ‌టంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌డెం ప్రాజెక్టు రెండు జిల్లాలు, ఆరు మండ‌లాల‌కు వ‌ర ప్ర‌దాయ‌ని.. సుమారు 65 వేల ఎక‌రాల‌కు సాగునీరిందించే ప్రాజెక్టు ఇది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జులైలోనే విప‌రీత‌మైన వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో కడెం జలాశయానికి 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. బయటకు 3 లక్షల క్యూసెక్కులు వదిలారు. 2 లక్షల క్యూసెక్కుల అదనపు ప్రవాహంతో ముప్పు ఏర్పడింది. 18 గేట్లలో 17 ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 700 అడుగుల కంటే… దాదాపు 14 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించి భయభ్రాంతులకు గురిచేసింది. గేట్లలో చెట్లు, కొమ్మలు ఇరుక్కొని ఆనకట్ట సహా పరీవాహక ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ప్రాజెక్టులోని 18 గేట్లలో 1, 2 నెంబరు గేట్ల కౌంటర్‌ వెయిట్‌ కొట్టుకుపోగా 12వ నెంబరు గేటు తెరుచుకోనేలేదు. నాలుగో నెంబరు గేటు పగుళ్లు తేలింది.

భారీ వ‌ర‌ద కార‌ణంగా ప్రాజెక్టు కొట్టుకుపోతుంద‌ని అంతా భావించారు. అధికారులు సైతం దేవుడిపై భారం వేసి చేతులెత్తేశారు. అదృష్టం కొద్దీ ప్రాజెక్టు ప‌క్క‌న గండి ప‌డి ప‌క్క నుంచి నీరు వెళ్లిపోయింది. ఇక గేట్ల ప‌రిస్థితి కూడా అధ్వాన్నంగా మారింది. ఈసారి ప్రాజెక్టు కింద సాగులేన‌ట్లే అని అంతా భావించారు. కానీ సాగునీటి శాఖ అధికారులు, ఇంజ‌నీరింగ్ నిపుణులు స‌మ‌న్వ‌యంతో యుద్ద‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేశారు. గేట్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయ‌డంతో ప్ర‌స్తుతం నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థామ‌ర్థ్యం 700 ఫీట్లు కాగా, 693 ఫీట్ల‌కు చేరుకుంది. ప్రాజెక్టులో ఆరు టీఎంసీల నీరు ఉంది. ప్ర‌స్తుతం ఇన్‌ఫ్లో 1573 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొన‌సాగుతోంది.

వరద గేట్లు కిందకు దిగడం, ప్రాజెక్ట్ నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడెం జలాశయం కింద సుమారు 65 వేల ఎకరాల్లో పంటసాగవుతుంది. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, మంచిర్యాల మండ‌లాల‌కు ల‌బ్ధి చేకూరుతుంది. ఈ రోజు (శుక్ర‌వారం) సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌, మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్‌రావు ఆయ‌క‌ట్టుకు నీటిని విడుద‌ల చేయ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like