వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు

Abolish the VRA system forever

CM KCR: వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. వీఆర్ఏల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ‌, స‌ర్దుబాటుపై స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ ఆదివారం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అర్హత ప్రకారం మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.

ఈ సంద‌ర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కొనియాడారు. మారిన పరిస్థితుల్లో వీఆర్ఏల వృత్తికి ప్రాధన్య‌తా తగ్గిన నేపథ్యంలో, వారికి రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి, పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వార‌సుల‌కు ఇచ్చేలా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వీఆర్ఏల స‌ర్దుబాటు, ఇత‌ర అంశాల‌కు సంబంధించిన జీవో సోమ‌వారం విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like