అలా చేయ‌కండి ప్లీజ్‌…

అధిష్టానానికి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత బీజేపీ బలం పుంజుకోవడం.. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల తరువాత మరింత బలహీనపడుతున్నట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీజేపీనే తమ ప్రత్యర్థి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. బీజేపీ టార్గెట్‌గా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు కొనసాగుతున్నాయి. ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్‌ టార్గెట్‌గా రాజకీయాలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్.. బీజేపీపై కూడా విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రంలో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయనే చర్చ జరుగుతోంది.

ఢిల్లీలో పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనకు టీఆర్ఎస్ కూడా జత కలిసింది. అందులో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ ఉన్నాయి. ఈ రెండు పార్టీల నేతలు కలిసి సమావేశంలో పాల్గొనడాన్ని తెలంగాణ బీజేపీ హైలెట్ చేసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అని.. తెలంగాణలో ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకోవడం మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆందోళనలో పాల్గొనాలని.. వారితో కలిసి సమావేశంలో పాల్గొనాలనే ఆలోచన టీఆర్ఎస్‌కు లేకపోయినా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ సహా పలు విపక్షాలతో టీఆర్ఎస్ సమావేశమైంది.

అయితే ఇది తెలంగాణలోని కాంగ్రెస్ నేతలకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన నిరసనలు, సమావేశాల్లో టీఆర్ఎస్ పాల్గొంటే.. అది రాష్ట్రస్థాయిలో తమకు నష్టం కలిగిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఢిల్లీ స్థాయిలోని కొందరు కాంగ్రెస్ పెద్దలకు రేవంత్ రెడ్డి అండ్ టీమ్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటేనే రాష్ట్రంలో తాము ఆ పార్టీపై చేస్తున్న రాజకీయ పోరాటాల ద్వారా పొలిటికల్ మైలేజీ ఉంటుందని.. అలా జరగని పక్షంలో మొదటికే మోసం వస్తుందని నేతలు వారికి చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like