రాహుల్ గాంధీకి అదే బంగ్లా కేటాయింపు

Rahul Gandhi: రాహుల్ గాంధీ కి పాత ఇల్లునే కేటాయించారు. ఆయ‌న లోక్‌సభ సభ్యత్వం రద్దు కావడంతో ఎంపీగా కేటాయించిన ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరించడంతో ఆయనకు పాత ఇల్లు కేటాయిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. గతంలో ఆయన నివసించిన 12, తుగ్లక్ లేన్ బంగళాను తిరిగి ఆయనకు ఇవ్వాలని లోక్‌సభ హౌస్ కమిటీ నిర్ణయించింది.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో నిబంధనల ప్రకారం ఏప్రిల్ 22న రాహుల్ తన అధికారిక బంగళా ఖాళీ చేశారు. తల్లి సోనియాగాంధీ 10 జనపథ్ రెసిడెన్స్‌లో ఆమెతో పాటే ఉంటున్నారు. రాహుల్‌కు తమ ఇంట్లో నివాసం కల్పించేందుకు పలువురు పార్టీ నేతలు మందుకు వచ్చారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ‘స్టే’తో రాహుల్‌పై పడిన అనర్హత వేటును లోక్‌సభ సెక్రటేరియట్ పునరుద్ధరించింది. దీంతో ఆయనకు ఇంతకుముందు కేటాయించిన బంగ్లానే తిరిగి లోక్‌సభ హౌస్ కమిటీ కేటాయించింది.

రాహుల్ గాంధీ 2004లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి మొదటిసారి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆయనకు ఢిల్లీలో తుగ్లక్ రోడులో ఇల్లును కేటాయించారు. అదే ఇంట్లో రాహుల్ ఇప్పటివరకు కొనసాగుతున్నారు. కర్ణాటకలోని కోలార్‌లో 2019 ఎన్నికల ప్రచారం భాగంగా మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై క్రిమినల్, పరువు నష్టం కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే ఆయన లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలోనే ఆయన తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది.

ఎంపీగా అధికారిక నివాసాన్ని తిరిగి పొందడంపై రాహుల్‌ మీడియా ముందు స్పందించారు. యావత్ దేశం తన ఇల్లేనని చెప్పారు. రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్‌ బంగళాలో 2005 నుంచి గత ఏప్రిల్‌ వరకూ ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like