అమర్‌నాథ్ యాత్రలో ప‌ది మృతి

ఆకస్మిక వరదల కారణంగా అమర్‌నాథ్ యాత్రలో ఆప‌శృతి చోటు చేసుకుంది. అక్క‌డ గురువారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.వరదల ధాటికి అమర్‌నాథ్‌ యాత్రికుల గుడారాలు కొట్టుకుపోయాయి. గుడారాల్లో ఉన్న పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 40 మంది ఆచూకీ తెలియాల్సిఉందని సమాచారం. మిగతావారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అమర్‌నాథ్‌ పరిసరాల్లో మ‌ళ్లీ శుక్ర‌వారం సాయంత్రం నుంచి కుంభవృష్టి వర్షం కురుస్తోంది. దీంతో సహాయకచర్యలకు కొంత ఆటంకమేర్పడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఐటీబీపీ అధికారులు వెల్లడించారు. వరదల దృష్ట్యా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.అమర్‌నాథ్‌లోని మంచు లింగాన్ని దర్శించుకోవాలంటే శ్రీనగర్‌కు దాదాపు 90కి.మీ దూరంలో పహల్గామ్‌తోపాటు బాల్తాల్‌ పట్టణాల మీదుగా రెండు మార్గాలు ఉంటాయి. ఆయా మార్గాల్లోని బేస్‌ క్యాంపుల నుంచి బ్యాచ్‌ల వారీగా పంపిస్తారు. ఈ క్రమంలో ప్రతికూల వాతావరణం కారణంగా గత మంగళవారం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం వాతావరణం అనుకూలించడంతో యాత్రను మళ్లీ పునరుద్ధరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like