అమ్మగా అడుగుతున్న… ఆందోళన విరమించండి

కొన్ని రోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం మీ మంత్రిగానే కాదు. ఒక అమ్మగా బాధేస్తుంది.. ఆందోళన విరమించండని మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆందోళన విరమించాలని, మీ సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ని నియమించామని తెలిపారు. ఉన్నత విద్యామండలి వైస్ఛైర్మన్ వెంకటరమణని కూడ మీ దగ్గరికి ప్రభుత్వం పంపించిందని వారితో చర్చించాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను తక్కువ చేయటం తన ఉద్దేశ్యం కాదన్నారు. ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఇక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కమిటి ఉందన్నారు. ఆ కమిటీ యూనివర్సిటీ కమిటి చర్చించుకుని పరిష్కరించుకోవలసిన అంశాలను, ఆందోళనలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన మాత్రమే నాదని మంత్రి విద్యార్థులకు స్పష్టం చేశారు.

కోవిడ్ కారణంగా 2 సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా క్లాస్లు సరిగ్గా నడవక, చిన్న అంశాలను పరిష్కరించడంలో కొంత జాప్యం జరిగిందని అంగీకరించారు. ఈ యూనివర్సిటీకి ఒక ప్రత్యేకత ఉంది. విద్యార్థుల భవిష్యత్ను ఉజ్వలంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కె.సి.ఆర్. 1000 నుండి 1500 వరకు విద్యార్థుల అడ్మిషన్స్ను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు బాసర విద్యార్థులను క్యాంపస్ నియామకాలకు సెలెక్ట్ చేసుకుంటున్నాయని అన్నారు. అటువంటి అత్యున్నత సంస్థ ప్రతిష్టకు భంగం కలుగవద్దని మాత్రమే కోరుతున్నానని మంత్రి సబిత వెల్లడించారు. రాజకీయాలకు ఈ యూనివర్సిటీ వేదిక కావద్దని నా విజ్ఞప్తి అన్నారు.

“ఇది మీ ప్రభుత్వం” దయచేసి చర్చించండి. ఆందోళనను విరమించండి. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నానని కోరారు.”మీ బంగారు భవిష్యత్తే మీ తల్లిదండ్రుల కల. కె.సి.ఆర్. ప్రభుత్వం కల కూడా” అదే! అని మంత్రి సబిత స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like