కేసు ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు..

స‌రుకుల గోల్‌మాల్ పై ఐసీడీఎస్‌లో ఆందోళ‌న‌ - అవి త‌మ‌వి కాద‌ని చెప్పించే ప్ర‌య‌త్నాలు - త‌ప్పు డ్రైవ‌ర్‌పై నెట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న అధికారులు

మంచిర్యాల – ఐసీడీఎస్‌లో గుడ్లు, పాలు అమ్ముకున్న కేసును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఐసీడీఎస్‌లో ఇలాంటి ప‌నుల్లో ఘ‌నాపాఠిగా ఉన్న ఓ సీడీపీవో దీనికి తెర తీశారు. ఇందులో టీచ‌ర్ల పాత్ర ఏం లేద‌ని కేవ‌లం ట్రాలీ డ్రైవ‌ర్ దీనికి సూత్ర‌ధారిగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అస‌లు కేసేంటి..?
కోట‌ప‌ల్లి, జైపూర్‌,బీమారం మండ‌లాల‌కు చెందిన కొంద‌రు టీచ‌ర్లు త‌మ‌కు కేటాయించిన గుడ్లు, పాలు బ‌య‌ట విక్ర‌యించేందుకు ట్రాలీ డ్రైవ‌ర్‌కు వాటిని అప్ప‌గించారు. వాటిని తీసుకువెళ్తున్న స‌మ‌యంలో న‌స్పూరు పోలీసుల‌కు అందిన స‌మాచారం మేర‌కు వాటిని ప‌ట్టుకుని కేసు న‌మోదు చేశారు. ట్రాలీ డ్రైవ‌ర్‌తో పాటు అందులో ఉన్న కోడిగుడ్లు, పాలు స్వాధీనం చేసుకున్నారు. కోట‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌ప‌ల్లికి చెందిన టీచ‌ర్ స‌రోజ‌, వేమ‌న‌ప‌ల్లి మండ‌లం టీచ‌ర్ జ‌య‌ప్ర‌ద‌, జైపూర్ మండ‌లం టీచ‌ర్ మ‌ణెమ్మ‌, బీమారం మండ‌లం రాంపూర్‌కు చెందిన మ‌రో టీచ‌ర్‌కు చెందిన పాల‌ప్యాకెట్లు, గుడ్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల‌కు ఎలా తెలిసింది…?
ఈ విష‌యంలో ఒక సూప‌ర్‌వైజ‌ర్ ద్వారానే విష‌యం లీకైంద‌ని స‌మాచారం. ట్రాలీ డ్రైవ‌ర్ త‌న‌కు స‌క్ర‌మంగా డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఐసీడీఎస్‌కు చెందిన ఒక సూప‌ర్‌వైజ‌ర్ జైపూర్ పోలీసుల‌కు, న‌స్పూరు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఆ డ్రైవ‌ర్ న‌స్పూరు పోలీసుల‌కు చిక్క‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ అంగ‌న్వాడీ సంఘానికి చెందిన నేత‌లు ఆ సూప‌ర్‌వైజ‌ర్‌ను ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. త‌న‌కు విష‌యం ఏమీ తెలియ‌ద‌ని ఆ సూప‌ర్‌వైజ‌ర్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

అస‌లు వ్య‌క్తి త‌ప్పించుకున్నారా..?
పోలీసులు ట్రాలీని ప‌ట్టుకున్న స‌మ‌యంలో వెన‌కాలే వ‌స్తున్న అస‌లు సూత్ర‌ధారి త‌ప్పించుకున్న‌ట్లు స‌మాచారం. ఆ ట్రాలీతో వెన‌కాలే మ‌రికొంత స‌రుకుతో ఒక అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌కు చెందిన కొడుకు కారులో వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ట్రాలీ పోలీసుల‌కు దొర‌క‌గానే అత‌ను వెన‌క నుంచి ప‌రార‌యిన‌ట్లు స‌మాచారం. కేవ‌లం ట్రాలీ డ్రైవ‌ర్ సంతోష్ ను మాత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అయితే అస‌లు స‌రుకు కేవ‌లం సంతోష్ మాత్ర‌మే బ‌య‌ట అమ్ముకునేందుకు తీసుకువెళ్తున్నాడ‌ని చెప్పే ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి.

ప్ర‌జాప్ర‌తినిధుల చుట్టూ అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు..
ఈ కేసు త‌ప్పించుకునేందుకు అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకువెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ పురాణం స‌తీష్ దృష్టికి కూడా తీసుకువెళ్లి కేసు మాఫీకి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో కోట‌ప‌ల్లి మండ‌లానికి చెందిన ఒక టీచ‌ర్‌పై గ్రామ‌స్తులు ఫిర్యాదు చేయ‌గా ఇలాగే బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికైనా అటు పోలీసులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప పేద‌ల‌కు అందాల్సిన అంగ‌న్‌వాడీ స‌ర‌కులు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ఉంటాయ‌ని ప‌లువురు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like