అంగ‌న్‌వాడీ పిల్ల‌లు.. అర్థ‌రాత్రి బరువు పెరుగుతున్న‌రు..

-రాత్రికి రాత్రే పిల్ల‌ల బ‌రువు, ఎత్తు మారుస్తున్న అంగ‌న్వాడీలు
-జిల్లా అధికారుల నుంచి వ‌చ్చిన ఆదేశాల కార‌ణం
-అలా మార్చ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌లు
-అంగ‌న్‌వాడీల‌కు ఫోన్లు, మెజేస్‌లు పంపిన అధికారులు

Anganwadi children are gaining weight in the middle of the night: మీరు బ‌క్క ప‌ల‌చ‌గా ఉన్నారా…? పోష‌కాహార‌లోపంతో బాధ‌ప‌డుతున్నారా..? మీరు బ‌రువు పెర‌గాల‌నుకుంటున్నారా..? అయితే అంగ‌న్‌వాడీ అధికారుల‌ను సంప్ర‌దించండి. వెంట‌నే మీరు బ‌రువు పెరుగుతారు… అలా ఇలా కాదు.. రెండు నుంచి మూడు కిలోలు అవ‌లీల‌గా పెరిగిపోతారు. ఇదేదో ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన అంశం అనుకుంటున్నారా..? నిజ్జంగా నిజ‌మిది..

మంచిర్యాల జిల్లా అంగ‌న్‌వాడీ కేంద్రాలు నిత్యం వివాదాల‌కు నిల‌యంగా మారుతోంది. శిశు,సంక్షేమ శాఖ అధికారులు నిత్యం వివాదాల్లో న‌లుగుతున్నారు. అటు అంగ‌న్‌వాడీలు, సీడీపీవోలు, సూప‌ర్‌వైజ‌ర్లు ఈ వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు. తాజాగా, వారు చేసిన ఓ ప‌ని ఆ శాఖ ప‌నితీరుకు నిద‌ర్శంగా మారుతోంది. అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో అన్ని స‌రుకులు ఇచ్చి ఎవ‌రూ కూడా పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డ‌కుండా చూడాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యం కానీ, ఇక్క‌డ అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌రిస్తున్నారు. దీంతో అస‌లు ల‌క్ష్యం దెబ్బ‌తింటోంది. పైగా ఉన్న‌తాధికారుల‌కు త‌ప్పుడు లెక్క‌లు చూపుతూ త‌మ చేతులు దులుపుకుంటున్నారు.

పోషకాహార లోపంతో ఎదుగుదల లేని పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బరువుతో పుట్టే పిల్లలు, బలహీనంగా ఉండే గర్భిణులు, గర్భిణుల్లో రక్తహీనత, మాతా శిశు మరణాల సంఖ్య లేకుండా చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ రకాల సేవలు అందిస్తోంది. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం తయారు చేసి కేంద్రాల్లోనే తినేలా చూడాలి. వీరికి పోషక అవసరాల్లో అధిక శాతం మాంసకృతులు, ఐరన్‌ ఇవ్వాలనేది ఐసీడీఎస్‌ లక్ష్యం. మరో వైపు పోషకాహార ప్రాధాన్యం గురించి గర్భిణులు, తల్లులకు అంగన్‌వాడీలు అవగాహన కల్పించాలి. పిల్ల‌లు, గ‌ర్భిణులు బ‌రువు త‌గ్గ‌కుండా వ‌య‌సు, ఎత్తుకు త‌గ్గ బ‌రువు ఉండేలా చూడాలి.

కానీ, ఇక్క‌డ మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌టం లేదు. దీంతో చాలా మంది పిల్ల‌లు బ‌రువు త‌క్కువ ఉండ‌ట‌మే కాకుండా, పోష‌కాహారలోపంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఉన్న‌తాధికారులు ప్ర‌తి స‌మావేశంలో ఇక్క‌డ అధికారుల‌ను పిల్ల‌ల బ‌రువు ఇత‌ర అంశాల్లో నిల‌దీస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ స‌మీక్షా స‌మావేశాల్లో అడుగుతున్నారు. దీంతో నిత్యం అంగ‌న్‌వాడీ కేంద్రాల‌కు వెళ్లి పిల్ల‌ల‌కు స‌రైన పోష‌కాహారం అందేలా చూడాల్సిన అధికారులు అందుకు విరుద్దంగా ప్ర‌వ‌రిస్తున్నారు. తాము త‌ప్పు చేయ‌డ‌మే కాకుండా, అలా చేయాలని మిగ‌తా వారిని సైతం ప్రోత్స‌హిస్తున్నారు.

అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో నిత్యం బ‌రువు, ఎత్తు చూడాల్సి ఉంటుంది. వాటితో పాటు జ‌బ్బ కొల‌త సైతం న‌మోదు చేయాలి. అయితే, అంగ‌న్ వాడీ టీచ‌ర్లు చూసే బ‌రువు, ఎత్తు కాకుండా వాటిని వ‌దిలేసి ప్ర‌భుత్వం ఇచ్చిన క‌ర‌దీపిక ఆధారంగా ఎత్తు, బ‌రువు న‌మోదు చేయాల‌ని అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు ఆదేశాల అందాయి. పౌష్టికాహార లోపంతో బాధ ప‌డుతూ బ‌రువు త‌క్కువ ఉండే పిల్ల‌లు జిల్లావ్యాప్తంగా ఎక్కువ‌గా ఉంటే త‌మ‌కు మెమోలు వ‌స్తున్నాయ‌నే ఉద్దేశంతో కొంద‌రు అధికారులు ఇలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ప‌లువురు సీడీపీవోలు, సూప‌ర్‌వైజ‌ర్లు అంగ‌న్వాడీ టీచ‌ర్ల‌కు ఫోన్లు చేసి పిల్ల‌ల బ‌రువులు మార్చాల‌ని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా చోట్ల టీచ‌ర్లు పిల్ల‌ల బ‌రువు, జ‌బ్బ చుట్టుకొల‌త మార్చేశారు. ఒక్కొక్క‌రిది రాత్రికి రాత్రే రెండు నుంచి మూడు కిలోల బ‌రువు మార్చారు.

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌కి చెందిన సిబ్బంది ఒక‌రు ఏకంగా టీచ‌ర్ల సెల్‌కి మెసేజ్ పంపించారు. మీరు కొలిచిన కొల‌త‌లు కాకుండా, క‌ర‌దీపికలో చూసి వేయాల‌ని ఆ మెసేజ్‌లో ఆదేశాలు జారీ చేశారు. ఇలా అధికారులే త‌ప్పులు చేస్తుంటే ఇక కింది స్థాయి అంగ‌న్వాడీ టీచ‌ర్ల ప‌రిస్థితి ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చు. వాస్త‌వానికి జిల్లాలో స‌క్ర‌మంగా త‌నిఖీలు చేసి అంగ‌న్‌వాడీ ప‌నితీరు మార్చాల‌ని అధికారులు సిబ్బంది క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే పిల్ల‌ల‌కు స‌రైన పౌష్టికాహారం అంద‌డం లేద‌ని ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like