అంగన్వాడీ టీచర్లు.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు..

-ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లతో సూపర్వైజర్ పోస్టులు దక్కించుకునే ప్రయత్నం
- పెద్దప‌ల్లి జిల్లాలో కొన్ని స‌ర్టిఫికెట్లు అక్ర‌మం అని ఆరోపణ‌లు
- వారికి పోస్టులు ద‌క్కితే త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని గ‌గ్గోలు
- ఓ అధికారి అండ‌దండ‌ల‌తో ఈ స‌ర్టిఫికెట్ల బాగోత‌మ‌ని ఆందోళ‌న
- సర్టిఫికెట్ల ధ్రువీకరణ సక్రమంగా నిర్వహించాలని డిమాండ్

అంగన్వాడీల్లో సూపర్వైజర్ పోస్టులను ఎలాగైనా దక్కించుకోవాలని కొందరు టీచర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు దళారులకు డబ్బులు ఇచ్చి ఆ మార్గం సాధ్యం కాకపోవడంతో ఇతర దారులు వెతుకుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొందరు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంగన్వాడీలో సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొందరు అంగన్వాడీ టీచర్లు ఎలాగైన పోస్టులు దక్కించుకునేందుకు అడ్డదారులు పడుతున్నారు. అస‌లు మొద‌ట్లోనే ఈ పోస్టులు ద‌క్కించుకునేందుకు కొంద‌రు ద‌ళారుల‌ను ఆశ్ర‌యించారు. పోస్టు కోసం రూ. 8 ల‌క్ష‌ల నుంచి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు మాట్లాడుకున్నారు. ముందుగా అడ్వాన్స్ సైతం ఇచ్చారు. ఇక మ‌రికొంత‌మంది మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధుల ద్వారా చెప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, మ‌హిళా సంక్షేమ శాఖ క‌మిష‌న‌ర్ దివ్య దేవ‌రాజ‌న్ మాత్రం ప‌రీక్ష‌లు చాలా ప‌క‌డ్బందీగా నిర్వ‌హించారు. త‌మ శాఖ ద్వారా ప‌రీక్ష‌లు జ‌రిగితే గోల్‌మాల్ జ‌రిగేందుకు ఆస్కారం ఉంటుంద‌ని యూనివ‌ర్సిటీకి ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త అప్ప‌గించారు.

ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లు చాలా ప‌క‌డ్బందీగా నిర్వ‌హించారు. ఎక్క‌డా ఎలాంటి పొర‌పొచ్చాల‌కు తావు లేకుండా వీటిని నిర్వ‌హించారు. రిజల్ట్ కూడా వెబ్సైట్లో ఉంచారు. అయితే దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీకి సంబంధించి జరిగిన పరీక్షల్లో తమకు అన్యాయం జరిగిందని కొందరు అంగన్వాడీ టీచర్లు కోర్టు మెట్లెక్కారు. ప‌లు అంశాల‌పై వారు కోర్టులో కేసు వేశారు. ఈ నేప‌థ్యంలో లిస్టులో మెరిట్ వ‌చ్చిన వారు, రిజ‌ర్వేష‌న్లు, ఇత‌ర వివ‌రాల ప్ర‌కారం పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ కోసం అధికారులు ప‌క‌డ్బందీగా ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌మిష‌న‌ర్ దివ్య‌దేవ‌రాజ‌న్ సైతం ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

అయితే, ఈ పోస్టులు ద‌క్కించుకునేందుకు కొంద‌రు టీచ‌ర్లు త‌మ వంతు ప్ర‌య‌త్నాలు పూర్తిగా చేస్తున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఈ పోస్టుల‌ను ద‌క్కించుకునేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. అగ్ర‌వ‌ర్ణాల్లో ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వారు (ఈడ‌బ్ల్యుఎస్‌) పేరిట కొన్ని పోస్టులు కేటాయిస్తున్నారు. దీనిని ఆస‌ర‌గా చేసుకుని ఆర్థికంగా ఉన్న‌వారు స‌ర్టిఫికెట్లు తీసుకున్నారు. సొంత భ‌వ‌నాలు, భూములు పెద్ద ఎత్తున ఉన్నా వారు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లు సంపాదించి రిజ‌ర్వేష‌న్ల కోటా కింద త‌మ‌కు పోస్టు రావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పెద్ద‌ప‌ల్లిలోని గోదావ‌రిఖ‌ని ప్రాంతంలో ముగ్గురు టీచ‌ర్లు ద‌ర‌ఖాస్తు చేసుకోగా, అందులో ఒక్క‌రు మాత్ర‌మే ఆర్థికంగా వెన‌క‌బ‌డిన వారు కాగా, మిగ‌తా ఇద్ద‌రు అన‌ర్హుల‌ని స‌మాచారం.

ఈ త‌ప్పుడు స‌ర్టిఫికెట్ల బాగోతం వెన‌క కొంద‌రు అధికారులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్లు జారీ చేసే స‌మ‌యంలో ఖ‌చ్చితంగా రెవెన్యూ అధికారులు వారి ఆర్థిక స్థితిగ‌తులు ప‌రిశీలించాలి. కానీ అవేమీ లేకుండానే ఈ స‌ర్టిఫికెట్లు జారీ చేయాలి. ఇక జిల్లా సంక్షేమ శాఖ అధికారులు వాటిపై దృష్టి సారించాలి. వారు కూడా అటువైపు దృష్టి పెట్ట‌లేదు. మీరు స‌ర్టిఫికెట్లు పెట్టండి.. అంతా మేం చూసుకుంటామ‌ని ఓ అధికారి ఈ ఇద్ద‌రు అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌కు హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. బీసీల్లో 18 మార్కులు వ‌చ్చిన వారికి పిలుపురాలేద‌ని, ఓసీల్లో ఒకరికి 11, 9, 16 మార్కులు వ‌చ్చిన వారిని పిలిచార‌ని ఇందులో మ‌త‌ల‌బు ఏంట‌ని అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇప్ప‌టికైనా స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ ప‌క‌డ్బందీగా జ‌ర‌గాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ముఖ్యంగా ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ల విష‌యంలో ఖ‌చ్చితంగా విచార‌ణ జ‌ర‌గాల‌ని ప‌లువురు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. లేక‌పోతే త‌మ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని అర్హులైన టీచ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like