అన్నారం బ్యారేజి అధికారుల నిర్బంధం

పరిహారం చెల్లించాలని నిరసన

త‌మ‌కు న‌ష్ట‌ప‌రిహారం స‌క్రమంగా అందించ‌డం లేద‌ని రైతులు అన్నారం బ్యారేజీ అధికారుల‌ను నిర్బంధించారు. అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో తాము భూములు కోల్పోయినా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోవడం లేద‌ని, పరిహారం అందించలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండ‌లం బీరెల్లి రైతులు సోమవారం అన్నారం బ్యారేజీ అధికారులకు గ్రామపంచాయతీలో తాళం వేశారు. బ్యారేజీ కాలువపై పెరిగిన చెట్ల‌ను శుభ్రం చేయించేందుకు వచ్చిన అధికారులను పంచాయతీ కార్యాల‌యంలో నిర్బంధించారు. డీఈతో పాటు సిబ్బందిని గ‌దిలో ఉంచి తాళం వేసిన రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప‌లువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో బీరెల్లి సమీపంలో కాలువ నిర్మాణ కోసం 15 ఎక‌రాల భూమి ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. మూడేళ్ల కింద‌ట అధికారులు ఈ భూమిని తీసుకున్నార‌ని తెలిపారు. ఒక్కో ఎకరానికి రూ. 8 లక్షల వరకు పరిహారం అందిస్తామని చెప్పి ఇంత వరకు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించాలని రైతులు అధికారుల‌ను ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రైతులకు పరిహారం అందిస్తామని ఉన్నతాధికారుల నుండి సృష్టమైన హామీ ఇస్తే వదిలేస్తామని రైతులు పేర్కొన్నారు.. రాత్రి పొద్దుపోయే వ‌ర‌కు రైతులు అధికారుల‌ను విడిచిపెట్ట‌లేదు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like