అంత వీజీ కాదు…

-కాంగ్రెస్‌లో అంత‌ర్గత పోరుతో న‌ల్లాల‌కు ఇబ్బందే
-ఆయ‌న రాక‌ను స్వాగతించ‌ని ప్రేంసాగ‌ర్ రావు

మంచిర్యాల : న‌ల్లాల ఓదెలు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయ‌న పార్టీలో చేర‌డం ఒకెత్తు కాగా, ఆయ‌న ఇప్పుడు ఆ పార్టీలో మ‌నుగ‌డ సాగించ‌డం ఇబ్బందిక‌ర ప‌రిస్థితులే త‌లెత్తే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆయ‌న చేరిక జిల్లాలోని పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఏఐసీసీ స‌భ్యుడు ప్రేంసాగ‌ర్ రావుకు స‌సేమిరా ఇష్టం లేదు. దీంతో న‌ల్లాల ఓదెలు ఆ అస‌మ్మ‌తి త‌ట్టుకునేందుకు ఇప్ప‌డు ఏం చేస్తారనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

న‌ల్లాల ఓదెలు.. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయ‌న పేరు హాట్ టాపిక్‌. ఆయ‌న‌తో పాటు ఆయ‌న భార్య జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ భాగ్య‌లక్ష్మి అధికార టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓదెలు చేరిక విష‌యంలో ప్రేంసాగ‌ర్ రావు మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. ఓదెలు మొద‌ట ప్రేంసాగ‌ర్ రావును సంప్ర‌దించినా ఆయ‌న స‌రిగ్గా స్పందించ‌లేదు. దీంతో ఓదెలు నేరుగా రాష్ట్రంలోని నేత‌ల‌ను సంప్ర‌దించి వారి ద్వారా ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేసిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రేంసాగ‌ర్ రావు ఓదెలు రాక‌ను వ్య‌తిరేకించ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి త‌న శిష్యుడుకి చెన్నూరులో టిక్కెట్టు ఇప్పించుకోవ‌డం… రెండు త‌న వారికి టిక్కెట్టు ఇప్పించుకోవ‌డం ద్వారా త‌న వ‌ర్గాన్ని పెంచి పోషించుకోవ‌డం, రేప‌టి రోజున కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే త‌న ప‌ర‌పతి చాటుకుని త‌ద్వారా ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఇలా ఎన్నో ర‌కాలుగా ప్రేంసాగ‌ర్ రావు ముందుకు వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే న‌ల్లాల ఓదెలు రాక ఆయ‌న‌కు మింగుడుప‌డ‌ని అంశంగా మారింది. దీంతో స‌హ‌జంగానే ఓదెలు రాక‌ను ప్రేంసాగ‌ర్ రావు వ్య‌తిరేక‌రిస్తున్నారు.

మ‌రోవైపు ఓదెలు సైతం ప్రేంసాగ‌ర్ రావుకు వ్య‌తిరేకిగా ముద్ర వేయించుకున్న జ‌న‌క్‌ప్ర‌సాద్‌ను వెళ్లి క‌లిశారు. ఇది కూడా ప్రేంసాగ‌ర్ రావుకు మింగుడు ప‌డ‌ని అంశ‌మే. జిల్లాలో ఉన్న మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న అనుచ‌రుల‌ను గెలిపించుకుని చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న ప్రేంసాగ‌ర్ రావు న‌ల్లాల ఓదెలు పార్టీలో చేరే అంశాన్ని ఎప్పుడు అంగీక‌రించ‌ర‌ని, ఆయ‌నకు స‌హ‌క‌రించ‌ర‌ని ప‌లువురు రాజ‌కీయ పరిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితుల్లో న‌ల్లాల ఓదెలు పార్టీలో ఎలా ఇముడుతారు అన్న‌ది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది.

కాంగ్రెస్ స‌భ్య‌త్వ న‌మోదులో భాగంగా ప్రేంసాగ‌ర్ రావు త‌న అనుచ‌రుల ద్వారా రికార్డు స్థాయిలో స‌భ్య‌త్వం చేయించారు. ప్రేంసాగ‌ర్ రావు చెన్నూరులో పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు త‌యారు చేసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. న‌ల్లాల ఓదెలు రేప‌టి రోజున ఎమ్మెల్యేగా బ‌రిలో దిగితే ప్రేంసాగ‌ర్ రావు స‌హ‌క‌రించ‌క‌పోతే ప‌రిస్థితి ఏంటి అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా, ఏదైనా కార్య‌క్ర‌మం ముందుకు తీసుకువెళ్లాల‌న్నా కార్య‌క‌ర్త‌ల మ‌ద్ద‌తు త‌ప్ప‌ని స‌రి. ప్రేంసాగ‌ర్ రావు అది కూడా లేకుండా చేస్తార‌నే ప్ర‌శ్న‌లు సైతం త‌లెత్తుతున్నాయి.

ఇలా న‌ల్లాల ఓదెలు ముందు ఎన్నో స‌వాళ్లు ఉన్నాయి. త‌న‌కు ఉన్న సానుభూతి ద్వారా ముందుకు వెళ్లాల‌ని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్ద‌ల ద్వారా ప్రేం సాగ‌ర్ రావుకు చెప్పించి అస‌మ్మ‌తి చ‌ల్లార్చి ఆ త‌ర్వాత పార్టీ కార్య‌క్ర‌మాల్లో విస్తృతంగా పాల్గొనాల‌ని త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like