సిమ్స్ లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకోండి

Singareni: రామగుండంలో ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజ్ (సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో సీట్ల కోసం సింగరేణి ఉద్యోగులు, అధికారుల పిల్లలు ఈనెల 14లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఎన్.బలరామ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రామగుండంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీకి సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పేరు పెట్టడంతో పాటు ఆ కళాశాలలో 5 శాతం సీట్లను సింగరేణి పిల్లలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ అవకాశాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే పొందవచ్చని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించినట్లు తెలిపారు.

ఐదు శాతం రిజర్వేషన్ కింద సింగరేణి కార్మికుల పిల్లలకు ఏడు సీట్లు లభిస్తాయన్నారు. ఈ సీట్లను జాతీయ స్థాయి నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన వారిలో అత్యుత్తమ ర్యాంకుతో పాటు ఎస్.సి., ఎస్.టి., బి.సి., రిజర్వేషన్ వర్తింపజేస్తూ సీట్లు కేటాయిస్తారని తెలిపారు.

ఈ సీట్ల కోసం దరఖాస్తు చేయదలచుకున్న సింగరేణి ఉద్యోగుల పిల్లలు వారి తల్లి, తండ్రి పని చేస్తున్న గని లేదా విభాగం అధిపతుల నుంచి నిర్దేశిత నమూనాలో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని సమర్పించాలన్నారు. సోమవారం దీనిపై సింగరేణి హెచ్ఆర్డీ శాఖ సర్క్యూలర్ విడుదల చేసిందన్నారు. వైద్య విద్య చేయాలనుకునే సింగరేణి పిల్లలకు ఇది గొప్ప అవకాశం అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like