అర్ధ‌రాత్రి 10 కి.మీ ప‌రుగు ప్రాక్టీస్‌…

సీఈవోల నుంచి సెలబ్రిటీల వరకు కదిలిస్తోన్న వీడియో

అర్ధ‌రాత్రి ఓ 19 ఏండ్ల యువ‌కుడు ప‌రుగులు పెడుతున్నాడు. తాను ప‌ని చేసే సంస్థ నుంచి ఇంటి వ‌ర‌కు ప్ర‌తి రోజు అలాగే ప‌రుగులు పెడ‌తాడు… మ‌ధ్య‌లో ఎవ‌ర‌న్నా లిఫ్ట్ ఇచ్చినా తీసుకోడు. మ‌రి అత‌డు ఎందుకు అలా ప‌రుగులు పెడుతున్నాడు..? అత‌ని ల‌క్ష్యం ఏంటి..?

ఉత్తరఖాండ్‌ అల్మోరాకు చెందిన 19 ఏళ్ల ప్రదీప్ మెహ్రా మధ్యరాత్రి నోయిడా రోడ్డుపై ప‌రుగులు తీస్తున్నాడు. అత‌ను నోయిడా సెక్టార్ 16లోని మెక్ డొనాల్డ్ అవుట్ లెట్‌లో పని చేస్తాడు. పొద్దున వెళితే అర్ధరాత్రి వరకు డ్యూటీ. రాత్రి విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల దూరంలోని బరోలాలో ఉన్న తన ఇంటి వరకు పరిగెత్తుతూ వెళ్లడం అతడి దినచర్య. అతడితోపాటు అతడి సోదరుడు, అమ్మ కలసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రదీప్ అమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్ర‌దీప్ కేవ‌లం అర్ధ‌రాత్రి మాత్ర‌మే ప‌రుగులు తీస్తాడు. ఉద‌యాన్నే నిద్ర‌లేచి వంట చేసుకుని త‌ల్లికి సేవ‌లు చేయాలి. అందుకే రాత్రి త‌న ప‌నులు ముగించుకుని ఇంటికి వెళ్లేప్పుడు మాత్రమే ర‌న్నింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఇంత‌కీ అత‌ని ల‌క్ష్యం ఏమిటంటే ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగం సంపాదించడం. దాని కోస‌మే ఉద‌యం అవ‌కాశం లేక‌పోయినా అర్ధ‌రాత్రి ర‌న్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అత‌ను అలా ప‌రిగెత్త‌డం జాతీయ అవార్డు గ్ర‌హీత‌ చిత్ర నిర్మాత వినోద్ కాప్రీ వీడియో తీశారు. అది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

ప్ర‌దీప్ బ్యాగ్ వేసుకుని పరిగెత్తడం వినోద్ కాప్రి చూశారు. ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నాడేమోనని వినోద్ కాప్రి కారును స్లో చేసి, లిఫ్ట్ కావాలేమో అని అడిగారు. కానీ ఆ యువకుడు తిరస్కరించాడు. త‌న‌తో మాట్లాడుతూనే వీడియో తీసిన కాప్రి ఒకవేళ మన వీడియో వైరల్ అయితే.. అని ప్ర‌దీప్‌ కాప్రి ప్రశ్నించగా.. ఎవరు నన్ను గుర్తుపడతారు? ఏం కాదు. నేనేమీ తప్పు చేయడం లేదంటూ సమాధానమిచ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎంతో మంది హృదయాలను కదలించింది. నిమిషాల వ్యవధిలోనే ఆ బాలుడి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

‘ఇదే నిజమైన బంగారం’ అంటూ వినోద్ కాప్రి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరి సంభాషణే ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండైంది. ఒక్కరేమిటి..? దిగ్గజ కంపెనీల సీఈవోల నుంచి రాజకీయ నేతలు, సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. కేవలం 12 గంటల్లోనే ఈ వీడియోకు 38 లక్షలకు పైగా వ్యూస్, 1,53,000 లైక్స్ వచ్చాయి. ఇంకా లైక్స్ వస్తూనే ఉన్నాయి. ప్రదీప్ మెహ్రా లక్షల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడంటూ.. నిజంగా ఆ యువకుడు అమేజింగ్ అంటూ కొనియాడుతున్నారు. మెహ్రా సంకల్పాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. గతంపై కాకుండా.. ప్రస్తుత, భవిష్యత్‌పైనే తన ఫోకస్ అని కొనియాడుతున్నారు. సంకల్పమంటే ఇదంటూ కొనియాడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like