బీజేపీలోకి గ‌డ్డం అరవింద్‌రెడ్డి

-పార్టీలో త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే భావ‌న‌
-ఆయ‌న‌కు ట‌చ్‌లో ఉన్న ఈటెల‌, మ‌రికొంద‌రు నేత‌లు
-అర‌వింద్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్న మ‌హేశ్వ‌ర్‌రెడ్డి, వివేక్‌
-గ‌డ్డం బ‌య‌టికి వెళ్తే బీఆర్ఎస్‌కు తీవ్ర న‌ష్టం

Arvind Reddy joins BJP: తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి బీజేపి తీర్థం పుచ్చుకోనున్నారా..? కొద్ది రోజుల్లోనే ఆయన చేరిక ఉంటుందా..? పలుమార్లు పార్టీ అధినేత కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన గ‌డ్డం ఈసారి శాశ్వ‌తంగా పార్టీ వీడ‌నున్నారా..? బీజేపీలో ఉన్న ఆయ‌న స‌న్నిహితులు పార్టీలోకి ర‌మ్మ‌ని ఒత్తిడి తెస్తున్నారా..? చివ‌ర‌కు ఆయ‌న అందులో చేరేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారా..? అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు…

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గ‌డ్డం అర‌వింద్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి సంబంధించి అన్ని సిద్దం చేసుకున్నారు. త‌న‌తో పాటు పెద్దఎత్తున క్యాడ‌ర్‌ తీసుకువెళ్లాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌తో బీజేపీ చేరిక‌ల క‌మిటీ చైర్మ‌న్‌ ఈటెల రాజేంద‌ర్ ట‌చ్‌లో ఉన్నారు. గ‌డ్డం అర‌వింద్‌రెడ్డితో రెండు, మూడు సార్లు మాట్లాడారు కూడా. ఆయ‌న పాత మిత్రుడు ప‌శ్చిమ జిల్లాకు చెందిన మ‌హేశ్వ‌ర్‌రెడ్డి సైతం మాట్లాడారు. ఆయ‌న బీజేపీలో చేరిన నేప‌థ్యంలో గ‌డ్డం అర‌వింద్‌రెడ్డిని సైతం ఆహ్వానిస్తున్నారు. ఇక చిర‌కాల మిత్రుడు వివేక్ సైతం ఎప్ప‌టి నుంచో రావాల్సిందిగా కోరుతున్నారు. ఇన్ని సానుకూల అంశాల నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో బీజేపీలో చేరాల‌ని ఆయ‌న స‌న్నిహితుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

మ‌రోవైపు ప‌ద‌వి ఇస్తామ‌ని ఆశ చూపి పార్టీలోకి తీసుకువ‌చ్చి క‌నీసం త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని అరవింద్‌రెడ్డి భావిస్తున్నారు. దీంతో అలిగిన గ‌డ్డం అర‌వింద్‌రెడ్డి ఎక్క‌డా పార్టీ స‌మావేశాల్లో క‌నిపించ‌డం లేదు. క‌నీసం అధినేత ఆయ‌నను క‌నీసం పిలిచి కూడా మాట్లాడ‌లేదు. అధినేత పిలుపు కోసం వేచి చూసిన అర‌వింద్‌రెడ్డి విసిగి వేసారిపోయారు. దీంతో ఇక వేచి ఉంటే రాజకీయంగా త‌న‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌ని భావించిన అరవింద్ బ‌య‌ట‌కు వెళ్లేందుకే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లో పార్టీ నుంచి వెళ్లిపోతే త‌ప్ప త‌న‌కు గుర్తింపు ఉండ‌ద‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్నారు. అదే సమ‌యంలో త‌న‌కు బీజేపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని మీరంతా సిద్ధంగా ఉండాల‌ని క్యాడ‌ర్‌ను ఇప్ప‌టికే స‌మాయ‌త్తం చేసిన‌ట్లు స‌మాచారం.

అరవింద్‌రెడ్డి 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అప్పట్లో అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పొత్తులో ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2010 ఉపఎన్నికల్లో రెండోసారీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో.. కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దివాకర్ రావు చేతిలో ఓడిపోయారు. మహాకూటమిలో భాగంగా సీటు తనకే వస్తుందని ఆశించిన అరవింద్‌రెడ్డికి భంగపాటు తప్పలేదు. ప్రేమ్‌సాగర్‌రావుకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అరవింద్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కేసీఆర్ సమక్షంలో మళ్లీ టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు.

అరవింద్‌రెడ్డికి సౌమ్యుడు, అజాత శ‌త్రువుగా పేరుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే దివాక‌ర్‌రావు గెలుపులో ఆయ‌న క్రీయా శీల‌క పాత్ర పోషించారు. అన్ని పార్టీల్లో ఆయ‌న శిష్యులు ఉన్నారు. ఇదే ఆయ‌న‌కు బ‌లంగా మారింది. అదే స‌మ‌యంలో ఆయ‌న తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల రాజ‌కీయంగా ఎద‌గ‌లేకపోయారు. అందుకే ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో త‌ప్ప‌ట‌డుగు వేయ‌కూడ‌ద‌ని భావించిన గ‌డ్డం అర‌వింద్‌రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయ‌న బీజేపీలో చేరితే మాత్రం ఖ‌చ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని ప‌లువురు స్ప‌ష్టం చేస్తున్నారు. అర‌వింద్‌రెడ్డి చేరిక విష‌యంలో రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like