బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని నిలిపివేయాలి

ఎమ్మేల్యే నడిపెల్లి దివాకర్ రావు

Auction of coal blocks should be stopped: బొగ్గు బ్లాక్ ల వేలం ప్ర‌క్రియ వెంట‌నే నిలిపివేయాల‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఎమ్మేల్యే దివాకర్ రావు అధ్వర్యంలో ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీబీజీకేఎస్‌, టీఆర్ఎస్‌ నేతలు నల్ల జెండాలు ప‌ట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వేలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్నారు. బొగ్గు బ్లాకుల వేలంతో కంపెనీ పురోగతి దెబ్బ‌తింటుంద‌న్నారు. మొత్తం సింగ‌రేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం సింగ‌రేణిలో 16 వేల ఉద్యోగాలు కల్పించిందన్నారు. సింగ‌రేణిని ప్రైవేటీక‌రిస్తే స్థానిక యువకులు ఉద్యోగావకాశాలు కోల్పోతారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రధాని మోది సింగరేణి బొగ్గు బ్లాకుల విషయంలో తన ద్వంద వైఖరి విడనాడి సింగరేణి బొగ్గు బ్లాకుల సంస్థకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం మాజీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, కార్పొరేట్ చ‌ర్చ‌ల క‌మిటీ ప్ర‌తినిధి ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, కేంద్ర క‌మిటీ ఉపాధ్య‌క్షుడు అన్న‌య్య‌, సిక్స్‌మెన్ క‌మిటీ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్‌, పిట్ సెక్ర‌ట‌రీలు వెంక‌న్న‌, తిరుప‌తి, అజీజ్‌, స‌త్యనారాయ‌ణ‌, చారి, మంచిర్యాల మున్సిప‌ల్ చైర్మ‌న్ పెంట రాజ‌య్య, మాజీ చైర్‌ప‌ర్స‌న్ వ‌సుంధ‌ర, వంగ తిరుప‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like