అవి పోడు భూములు కావు

-ఆ గిరిజ‌నుల‌కు ఇండ్లు, భూములు ఉన్నాయి
-అడ‌వి ఆక్ర‌మించుకునేంద‌కు గుడిసెలు వేస్తున్నారు
-మ‌హిళలను ముందు పెట్టి అడవిని ఆక్రమించే ప్రయత్నం
-అటవీశాఖకు సహకరిస్తే ఉపాధి కల్పిస్తాం
-మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో పోడు పేరుతో చేస్తున్న రాద్దాంతం స‌రికాద‌ని జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆ గ్రామంలో ఇండ్లు, భూములు ఉన్నా కూడా అటవీ భూమిని ఆక్రమించాలని చూస్తున్నార‌ని చెప్పారు. కోయపోచగూడకు ఆనుకుని ఉన్నదంతా కవ్వాల్ టైగర్ రిజర్వుకు చెందిన అటవీ భూమి అన్నారు. ఇటు అటవీ రికార్డుల్లో గానీ, అటు రెవెన్యూ రికార్డుల్లో గానీ ఇప్పటిదాకా అక్కడ పోడు భూమే లేదని ఆమె స్ప‌ష్టం చేశారు.

అట‌వీ భూములను అక్రమిస్తు, అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులపై దాడులకు పాల్పడుతున్నార‌ని అన్నారు. అటవీశాఖ అధికారుల విధులను అడ్డుకుంటున్నారని శివాని పేర్కొన్నారు. వాస్తవంగా కోయపోచగూడెంలో పోడు భూములు లేవని, గతంలో ఎప్పుడూ అక్కడి వారు పోడు వ్యవసాయం చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. వాళ్లకు మాకులపేట గ్రామ పంచాయితీ పరిధిలో ఇండ్లు ఉన్నాయన్నారు. కొందరి ప్రోద్బలంతో ఫారెస్ట్ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ భూమి కవ్వాల్ అభయారణ్యంలో పరిధిలోకి వస్తుందన్నారు. అక్కడ ఎప్పుడూ పోడు భూములు ఉన్నట్లు ఫారెస్ట్, రెవెన్యూ రికార్డులు లేవని తెలిపారు. అక్కడికి మహిళలని పంపించి పోడు భూముల పేరుతో ఫారెస్ట్ భూములను అక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అది చట్టరీత్యా నేరమన్నారు. ఇతరులు చెప్పే మాటలను వినొద్దన్నారు. కోయపోచగూడ పరిధిలో ఇప్పటిదాకా పోడు భూములు లేవన్న వాదనకు మద్దతుగా తగిన ఆధారాలను ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇప్పటికైనా ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్పడ్డ వారు నిజాయితీగా అటవీశాఖ అధికారులకు సహకరిస్తే భవిష్యత్తులో వారికి ఫారెస్ట్ పనుల్లో ఉపాధి కల్పిస్తామని డీఎఫ్ఓ తెలిపారు. రెండవ సారి గుడిసెలు వేసుకున్నప్పుడు అటవీ, పోలీస్ శాఖలు తొలగించే క్రమంలో అటవీ శాఖ అధికారుల పై కారంపొడి, కర్రలతో దాడికి పాల్పడ్డారని స్ప‌ష్టం చేశారు. కొంతమంది అటవీశాఖ అధికారులకు గాయాలు కూడా అయ్యాయని సమావేశంలో పాల్గొన్న జన్నారం డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. మళ్లీ అదే రోజు రాత్రి మూడు గుడిసెలు వేశారని, వారు ఫారెస్ట్ భూముల్లో కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఆయన అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like