ఆయ‌న వ‌చ్చేది.. ఈయ‌న‌కు తెలియ‌ద‌ట‌..

-ఓదెలు కాంగ్రెస్‌లోకి రావ‌డంపై ప్రేంసాగ‌ర్ రావుకు స‌మాచారం లేదు
-త‌న అనుచ‌రుడికి చెన్నూరు టిక్కెట్టు ఇప్పించేందుకు పీఎస్ఆర్ ప్ర‌య‌త్నాలు
-న‌లాల్ల రాక‌తో ఆ ప్ర‌య‌త్నాల‌కు చెక్
-ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్న ప్రేంసాగ‌ర్ రావు వ‌ర్గం

మంచిర్యాల : ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు, జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ భాగ్య‌లక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇప్పుడు హాట్ టాపిక్.. అంత‌కంటే హాట్ టాపిక్ వ్య‌వ‌హారం బ‌య‌టికి రానిది మ‌రోటి ఉంది… ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యం జిల్లాలో సీనియ‌ర్ నాయ‌కుడు ప్రేంసాగ‌ర్ రావుకు క‌నీసం స‌మాచారం లేదు అనేది. ఆయ‌న స్వ‌యంగా ఏఐసీసీ స‌భ్యుడు, ఆయ‌న భార్య మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు కూడా. అలాంటిది ఆయ‌న‌కే ఎలాంటి స‌మాచారం లేకుండా న‌ల్లాల ఓదెలు, ఆయ‌న భార్య భాగ్య‌లక్ష్మితో క‌లిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అది కూడా పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఆయ‌న వ్య‌తిరేక వ‌ర్గానికి చెందిన దామోద‌ర రాజ‌న‌ర్సింహతో క‌లిసి అధిష్టానం వ‌ద్ద పార్టీలో చేరారు.

న‌ల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఇప్ప‌టికే ఆ పార్టీలో ఉన్న వ‌ర్గ‌పోరుకు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్ల‌య్యింది. ఓదెలు టీఆర్ఎస్ పార్టీలో ఇమ‌డ‌లేక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయ‌న బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న కాంగ్రెస్‌లో వెళ్లేందుకు ముందుగానే ప్రేంసాగ‌ర్ రావును సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఈ వ్య‌వ‌హారం తేలిగ్గా తీసుకున్న ప్రేంసాగ‌ర్ రావు త‌ర్వ‌త చూద్దాం అన్న‌ట్లు దాట వేశారు. దీంతో అప్ప‌టికే ఎలాగైనా పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్న ఓదెలు పైనున్న నేత‌ల‌ను సంప్ర‌దించారు. మాజీ ఎమ్మెల్యే, ఆయ‌న‌తో పాటు జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ పార్టీలో చేర‌డం త‌మ‌కు బ‌లం చేకూరుతుంద‌ని పెద్ద‌లు స‌రే అన్నారు. అంతేకాకుండా, చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత కోసం చూస్తున్న అధిష్టానానికి ఇది అందివ‌చ్చిన అవ‌కాశంలా క‌న్పించి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అప్ప‌టి నుంచి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ చ‌క్రం తిప్పారు. ఆయ‌నను ఇత‌ర నేత‌ల‌తో క‌ల్పించ‌డం ఢిల్లీ పెద్ద‌ల‌తో మంత‌నాలు నెర‌పి వారి అపాయిమెంట్ తీసుకోవ‌డం వ‌ర‌కు అటు రేవంత్‌రెడ్డి, ఇటు దామోద‌ర రాజ‌న‌ర్సింహ వెంట వెంట‌నే ప‌నులు చేసేశారు. న‌ల్లాలఓదెలు ఢిల్లీకి వెళ్లే వ‌ర‌కు కూడా ఎవ‌రికీ క‌నీసం స‌మాచారం లేదంటేనే ఎంత ప‌క‌డ్బందీ వ్య‌వ‌హారం న‌డిచిందో అర్ధం చేసుకోవ‌చ్చు. చివ‌ర‌కు ఓదెలు ఢిల్లీకి వెళ్లిన త‌ర్వాత కానీ విష‌యం లీక్ కాలేదు. ఇలా స్థానికంగా ఉన్న నేత‌ల‌కు ఎలాంటి స‌మాచారం లేకుండా, లీక్ కాకుండా కాంగ్రెస్ నేత‌లు చ‌క్రం తిప్పారు.

ఇలా అధిష్టానం సైలెంట్ గా త‌మ వ్యూహం అమ‌లు చేస్తుంటే ఇక్క‌డ ప్రేంసాగ‌ర్ రావు షాక్ తినాల్సి వ‌చ్చింది. ఎందుకంటే ఆయ‌న చెన్నూరులో త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ఆయ‌న త‌న అనుచ‌రుడు నూక‌ల ర‌మేష్‌కు టిక్కెట్టు ఇచ్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కే ఇక్క‌డ ఎమ్మెల్యే టిక్కెట్టు వ‌స్తుంద‌ని ప్ర‌చారం కూడా చేయించారు. అదే స‌మ‌యంలో ప్రేంసాగ‌ర్ రావు ఇక్క‌డ కూడా స‌భ్య‌త్వంపై ప్ర‌త్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున స‌భ్య‌త్వం చేయించారు. ఈ నేప‌థ్యంలో న‌ల్లాల ఓదెలు రాక ఆయ‌న‌కు మింగుడుప‌డ‌ని అంశ‌మే. మ‌రి న‌ల్లాల ఓదెలు రాక‌ను ఆయ‌న స్వాగతిస్తారా..? లేక వ్య‌తిరేకిస్తారా..? అనేది ఆసక్తిర‌కంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like