అయోధ్య రామ మందిర ప్రారంభం ఆ రోజే..

-హాజ‌రుకానున్న ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీ
-వెల్లడించిన నిర్మాణ కమిటీ

Ayodhya: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది. దీనికి సంబంధించిన వివ‌రాలు రామ మందిర నిర్మాణ కమిటీ వెల్లడించింది. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి పది రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క‌మిటీ తెలిపింది.

కోట్లాది మంది హిందువులకు ఆయ‌న ఆరాధ్య దైవం. ఆయ‌న పేరు చెబితే ఒళ్లు పుల‌క‌రిస్తుంది. అలాంటి రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య‌లో నిర్మిస్తున్న రామ‌మందిరం ప్రారంభానికి సిద్ధ‌మైంది. 2024 జనవరి 14 మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రధాన ఆలయాన్ని మూడు ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ ఆలయానికి చుట్టు ప‌క్క‌ల‌ 9ఎకరాల విస్తీర్ణంలో గోడ నిర్మిస్తారు. గోడపై రామాయణాన్ని తెలిపే శిల్పాలు ఉంటాయి. ఆలయానికి ఉన్న మూడు ద్వారాలు, గోపురానికి బంగారు పూతను పూయనున్నారు. నిర్మాణం పూర్తైన తర్వాత ఆలయ సముదాయంలో యాత్రికులకు వ‌స‌తి కేంద్రం, గోశాల, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం, ఆలయ అధికారుల కోసం పరిపాలనా భవనాలు, ఆలయ పూజారులకు వసతి గృహాలు ఉంటాయి.

రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నాలుగు అంతస్తుల ఆలయం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్‌ను రామ‌కథ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయ‌నున్నారు. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో గ్రౌండ్ ఫ్లోర్‌ నిర్మిస్తున్నారు. రామాలయ నిర్మాణం నగారా శైలిలో ఉంటుంది. దానికి 46 టేకు చెక్క తలుపులు ఉంటాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like