అయ్య‌గారిపై చ‌ర్య‌లు తీసుకోండి

బుగ్గ ఆల‌య పాల‌క‌వ‌ర్గం తీర్మానం - త్వ‌ర‌లో అధికారుల విచార‌ణ

మంచిర్యాల – బెల్లంప‌ల్లి మండ‌లంలోని బుగ్గ ఆల‌యానికి సంబంధించి అయ్య‌గారిపై క్ర‌మశిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పాల‌క‌మండ‌లి కోరింది. ఈ మేర‌కు రెండు రోజుల కింద‌ట తీర్మానాన్ని దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారుల‌కు పంపించారు. దీనిపై ఉన్న‌తాధికారులు వ‌చ్చి విచార‌ణ చేయ‌నున్నారు.

నాంది చెప్పింది నిజ‌మే..
బుగ్గ శ్రీ రాజ‌రాజేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో అయ్య‌గారు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, భ‌క్తుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ట్లు నాంది న్యూస్ స్ప‌ష్టం చేసింది. అదే స‌మ‌యంలో అక్క‌డ పెండ్లిండ్లు కూడా ఎప్పుడు ప‌డితే అప్పుడు, స‌ర్టిఫికెట్లు లేకుండానే మైన‌ర్ల‌కు సైతం వివాహాలు చేస్తున్న‌ట్లు వివ‌రించింది. ఆల‌య పాల‌క మండ‌లి కూడా దానిని ధ్రువీక‌రించింది. భ‌క్తుల‌ను డ‌బ్బుల విష‌యంలో డిమాండ్ చేస్తున్న విష‌యంతో పాటు పలు అంశాల‌పై తీర్మానాల‌ను ఆమోదించారు.

త్వ‌ర‌లో అధికారుల విచార‌ణ‌..
ఈ విష‌యంలో దేవాదాయ శాఖ అధికారులు రెండు, మూడు రోజుల్లో విచార‌ణ‌కు రానున్నారు. దీనిపై వాస్త‌వాలు నిర్దారించుకున్న త‌ర్వాత అయ్య‌గారిపై క్ర‌మ శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోనున్నారు. అదే స‌మ‌యంలో ఈవో సైతం విధుల ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా దృష్టి సారించాల‌ని బుగ్గ ఆల‌య ప్ర‌తిష్ట మంట‌క‌లిసిపోకుండా చూడాల‌ని భ‌క్తులు కోరుతున్నారు.

దొర‌క‌ని హుండీ దొంగ‌లు..
ప‌ది రోజుల కింద‌ట బుగ్గ దేవాల‌యానికి సంబంధించి హుండీ చోరీకి గురైంది. ఇప్ప‌టికే నాలుగు సార్లు ఇక్క‌డ దొంగ‌త‌నం జ‌రిగింది. ప్ర‌తిసారి పౌర్ణ‌మి సంద‌ర్భంగా హుండీ దొంగ‌త‌నం జ‌రుగుతోంది. దీంతో అది ఇంటి దొంగ‌ల ప‌నిగా ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నానికి సంబంధించి పోలీసు అధికారుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దొంగ‌లు దొర‌క‌లేదు. పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించి హుండీ దొంగ‌ల‌ను ప‌ట్టుకోవాల‌ని భ‌క్తులు కోరుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like