బాంబుల మోత‌.. బంకర్ లో నివాసం..

-బిక్కుబిక్కుమంటున్న ప‌లువురు తెలంగాణ విద్యార్థులు

ఓ పక్క యుద్ధం.. బాంబుల మోత.. మరోపక్క విమానాల రద్దు.. వెనక్కి వెళ్లే అవకాశం లేక బంకర్‌లో ఇరుక్కుని తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. మైనస్‌ 2 డిగ్రీల చలిలో, తాగునీరు సరిగా అందని పరిస్థితుల్లో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రెండు రోజులుగా కనీసం తాగునీరు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తున్న ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు చెబుతున్నారు.

బార్డర్‌కు చేరడం ఎలా?
ఉక్రెయిన్‌ నుంచి బయటపడితే భారత్‌కు చేరుకున్నట్లేనని అక్కడ చిక్కుకున్న మెడికోలు చెబుతున్నారు. కానీ, ఇక్కడి నుంచి ఎలా బయటికి వచ్చేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్క విన్నిస్తియాలోని పలు మెడికల్‌ యూనివర్సిటీల్లోనే 5 వేల మంది భారతీయులు ఎంబీబీఎస్‌, పీజీలు చదువుతున్నట్లు, అందులో తెలుగు వాళ్లు వెయ్యి మందికిపైగానే ఉంటారని తెలుస్తోంది. యుద్ధం కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవడం, బార్డర్‌కు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయిన కారణంగా ఒకేసారి ఇంత మందిని ఉక్రెయిన్‌ బార్డర్‌కు చేర్చడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఇక్కడి విన్నీసా యూనివర్సిటీ విద్యార్థులను హంగేరీ బార్డర్‌కు పంపించే ప్రయత్నంలో రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. సుమారు 700 మంది విద్యార్థులను ఒకేసారి తీసుకెళ్లడంతో అక్కడ సరిపడా రైళ్లు అందుబాటులో లేక పోవడంతో అందరూ వెనుదిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. రాత్రంతా బంకర్లలో క్షణ క్షణం భయం భయంగా గడిపిన విద్యార్థులు మ‌ళ్లీ ఉక్రెయిన్‌ బార్డర్‌ దాటేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, రవాణా సదుపాయం లేక అవస్థలు పడ్డారు.

తిండి అయిపోతోంది…
జ‌ప్రోజియా స‌మీప ప్రాంతాల్లో ర‌ష్యా బ‌ల‌గాలు ఉండ‌డంతో ఎవ‌రినీ బ‌య‌ట‌కు పంపించే ప‌రిస్థితి లేద‌ని స‌మ‌చారం. సుమీ రాష్ట్రం మొత్తం ర‌ష్యా స్వాధీనం చేసుకుంది. అక్క‌డ ప్ర‌స్తుతం షాపులు బంద్ చేశారు. విద్యార్థులు బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకుంటున్నారు. రొమేనియా వెళ్లేందుకు ప‌రిస్థితులు అనువుగా లేక‌పోవ‌డంతో విద్యార్థులు బాధ‌ప‌డుతున్నారు. బంక‌ర్ల‌లో సిగ్న‌ల్స్ లేక వెంటా తెచ్చుకున్న తిండి కూడా అయిపోతోంద‌ని విద్యార్థుల‌కు చెప్తున్నారు. దానికి తోడు వీడియోలు పోస్ట్ చేయ‌వ‌ద్దంటూ అధికారులు ఆదేశిస్తున్నారు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like