ఆట‌లో అర‌టి పండు…

టీబీజీకేఎస్ నేత మ‌ల్ల‌య్య‌కు మొండి చేయేనా...? ప‌ద‌వి ఇస్తార‌ని ప‌క్క‌న పెట్టార‌ని కార్య‌క‌ర్త‌ల్లో నైరాశ్యం ఆయ‌న‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోని అధిష్టానం దిక్కుతోచ‌ని స్థితిలో కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత కెంగ‌ర్ల‌మ‌ల్ల‌య్య‌ను అధిష్టానం క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల కార్య‌క‌ర్త‌ల్లో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తామ‌ని యూనియ‌న్‌లోకి ఆహ్వానించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ దిశ‌గా ఆలోచ‌న కూడా చేయ‌డం లేదు. ఏం చేయాలో అర్ధం కాక‌, కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించ‌లేక మ‌ల్ల‌య్య స‌తమ‌తం అవుతున్నారు.

సింగ‌రేణిలో త‌మ‌కంటూ ప్ర‌త్యేక కార్మిక సంఘం ఉండాల‌ని టీఆర్ ఎస్ పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా 2003లో టీబీజీకేఎస్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కీలక నాయ కుడిగా పని చేశారు. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో యూనియ‌న్ బాధ్య‌త‌లు వెంక‌ట్రావ్‌, మిర్యాల రాజిరెడ్డికి అప్ప‌గించారు. కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. అయితే అస‌లు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వికి చ‌ట్ట‌బ‌ద్ద‌త లేద‌ని సాక్షాత్తు అధ్య‌క్షుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌క‌టించ‌డంతో కెంగ‌ర్ల‌ను బ‌య‌ట‌కు వెళ్లారు. 2019 సెప్టెంబ‌ర్‌15న ఆ యూనియ‌న్‌కు రాజీనామా చేశారు.

ఆయ‌న బీఎంఎస్‌లో చేరారు. ఆయ‌న‌కు బీఎంఎస్ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. మ‌ల్ల‌య్య అనుచ‌రులు అంతా ఆ యూనియ‌న్ లో చేరారు. అప్ప‌టి వ‌ర‌కు సింగ‌రేణిలో నామ‌మాత్రంగా ఉన్న బీఎంఎస్‌ను ప‌టిష్టం మార్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించి అందుకు అనుగుణంగా ప‌నిచేశారు. దీనిని గ‌మ‌నించిన టీఆర్ ఎస్ వెంట‌నే బాల్క సుమ‌న్‌ను రంగంలోకి దించింది. కెంగ‌ర్ల మ‌ల్ల‌య్యతో మంత‌నాలు జ‌రిపి బాల్క యూనియ‌న్‌లో స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని తిరిగి టీబీజీకేఎస్‌లోకి ఆహ్వానించారు.

కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య‌ను అధినేత‌తో మాట్లాడించారు. స‌ముచిత స్థానంతో పాటు ప‌ద‌వి కూడా ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశారు. దీనిని న‌మ్మిన కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య రాత్రికి రాత్రే కార్య‌క‌ర్త‌ల‌కు సైతం చెప్పాపెట్ట‌కుండా బీఎంఎస్‌కు రాజీనామా ప్ర‌క‌టించారు. దీంతో కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌పై ఫైర్ అయ్యారు. అయితే త‌మ‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని అందుకే రాజీనామా చేసిన‌ట్లు కెంగ‌ర్ల అప్ప‌టి వ‌ర‌కైతే కార్య‌క‌ర్త‌ల‌ను బుజ్జ‌గించారు. దాదాపు ప‌ది నెల‌లు కావస్తున్నా అధిష్టానం క‌నీసం కెంగ‌ర్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. గ‌తంలో త‌న‌కు యూనియ‌న్‌లో అన్యాయం జ‌రిగిన‌ట్లే ఈసారి కూడా అన్యాయం జ‌రుగుతోంద‌ని మ‌ల్ల‌య్య వాపోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేక క‌క్క‌లేక మింగ‌లేక ఆయ‌న త‌ల ప‌ట్టుకున్నారు.

అటు బీఎంఎస్ బ‌లోపేత కాకుండా చేయ‌డంతో పాటు సింగ‌రేణిలో బీసీ నేత‌ను బ‌య‌ట‌కు పంపిన అప‌వాదు రాకుండా ఉండేందు కోసం టీఆర్ ఎస్ అధిష్టానం వూహ్యాత్మ‌కంగా కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య‌ను టీబీజీకేఎస్‌లో చేర్చుకుంది. ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తామ‌ని చెప్పినా ఏ ప‌ద‌వి ఇవ్వాలో తెలియ‌క విష‌యాన్ని నాన్చుతున్న‌ట్లు ప‌లువురు రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రోవైపు కెంగ‌ర్ల తిరిగి పునఃప్ర‌వేశం విష‌యం క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆయ‌న తిరిగి యూనియ‌న్‌లోకి వ‌స్తున్నార‌ని తెలుసుకుని అధ్య‌క్షుడు వెంక‌ట్రావ్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మిర్యాల రాజిరెడ్డి హ‌ఠాత్తుగా స‌మావేశం ఏర్పాటు చేసి త‌మ‌కు తాము తిరిగి ఎన్నుకునేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించి విజ‌యం సాధించారు. క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను యూనియ‌న్ గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఎన్నుకునేలా చేసి ఆమె కూడా వెన‌క ఉండి చ‌క్రం తిప్పారు.

ఈ కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య ఎపిసోడ్ అప్ప‌టికే దూరంగా ఉంటున్న క‌ల్వ‌కుంట్ల క‌విత‌, మంత్రి కేటీఆర్ మ‌ధ్య మ‌రింత దూరంగా పెంచింది. త‌న‌కు ఇష్టం లేని వ్య‌క్తిని యూనియ‌న్‌లోకి తిరిగి తీసుకురావ‌డం ప‌ట్ల క‌విత ఏ మాత్రం సంతృప్తిగా లేరు. దీంతో మ‌ల్ల‌య్య‌కు స్థానం క‌ల్పించ‌లేక‌పోతున్న‌ట్లు వినికిడి. ఇప్ప‌టికైనా ఆయ‌న‌కు ప‌ద‌వి ఇస్తారా..? లేక అలాగే ప‌క్క‌న పెడ‌తారా..? వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like