నల్లగొండ జిల్లా పర్యటన ఉద్రిక్తం: బండి సంజయ్‌పై కేసు నమోదు

సూర్యాపేట :  నల్గొండ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పర్యటనకు అనుమతి తీసుకోలేదని ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా అనుమతి లేకుండా పర్యటన సరికాదన్నారు. అనుమతి లేకుండా పర్యటించిన సంజయ్‌పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. సంజయ్‌తో పాటు శాంతిభద్రతల దృష్ట్యా ఇరుపార్టీల నేతలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సోమవారం బండి సంజయ్‌కుమార్‌ నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నేతలపై కేసు నమోదు చేశామన్నారు.

బండి సంజయ్‌ పర్యటనను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాఠీచార్జి చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా సభలు, సమావేశాలను అనుమతి లేదన్నారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్‌ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం, పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత చివరి నిమిషంలో అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపీ కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతిచోట ఉద్రిక్తత చోటు చేసుకున్నదన్నారు.

ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని రంగనాథ్‌ వివరించారు. మిర్యాలగూడ సబ్‌ డివిజన్‌ పరిధిలో పర్యటనను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో చోటు చేసుకున్న ఘటనలో పలువురు పోలీస్‌ సిబ్బందికి సైతం గాయాలయ్యాయన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like