బాస‌ర‌లో ఇక ఆన్‌లైన్ అక్ష‌రాభ్యాసాలు

Basara Saraswathi Temple : దేశంలో స‌రస్వ‌తి మాతా కొలువై ఉన్న ప్ర‌ముఖ పుణ్య క్షేత్రాల్లో బాస‌ర ఒక‌టి.. మనదేశంలో సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసర ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. వేద‌వ్యాస ప్ర‌తిష్టితమైన అమ్మ‌వారి స‌మ‌క్షంలో అక్ష‌రాభాస్యం చేయిస్తే తమ పిల్లలు గొప్ప చదువులు అభ్యసిస్తారని భక్తుల నమ్మకం. అందుకే పిల్ల‌ల‌కు అక్ష‌రాభాస్యం అన‌గానే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది బాస‌ర‌నే. ఇక్కడ సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలకోసం చిన్నారులతో వారి తల్లిదండ్రులు బారులుతీరుతారు.

అయితే, దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వారి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించాలన్నా వారికి సాధ్యంకాని పరిస్థితి. ప్రధానంగా ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం కావడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేక పోతున్నారు. భక్తులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆన్ లైన్ లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలో నివసిస్తున్న వారితో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే వారికి పూజచేసిన వస్తువులను తపాలాశాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు.

ఇక టికెట్ ధరల విష‌యానికి వ‌స్తే విదేశీయులకు రూ. 2,516, మన దేశంలో ఉన్నవారికి రూ. 1,516 గా నిర్ణయించినట్లు సమాచారం. వీటిని ఏవిధంగా చేయాలి తదితర అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈవో విజయరామారావు చర్చించారు. ఈ ధరల ఆమోదంకోసం కమిషనర్ కు లేఖ రాశారు. అనుమతి రాగానే ఆన్ లైన్ లో అక్షరాభ్యాసాలు, సరస్వతీపూజ, మూలా నక్షత్రం, వేద ఆశీర్వచనం పూజలను కూడా చేయడానికి ఆలయాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like