బీరు తాగి న‌డిచే బైక్‌..

-ఈ బైక్‌కు బీర్‌ పోస్తే చాలు
-240 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది

మ‌నోళ్ల‌కు బీరు తాగితే కిక్కు వ‌స్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కాళ్లు త‌డ‌బ‌డ‌తాయి.. మైకం వ‌స్తుంది.. కానీ, ఈ బైక్ మాత్రం అలా కాదు.. ఎంత బీరు తాగితే అంత స్పీడ్‌గా ర‌య్యిర‌య్యింటూ వెళ్లిపోతుంది. మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు పెట్రోల్, డీజిల్‌తో న‌డిచే బైక్‌ల‌ను చూశాం. అదేవిధంగా గ్యాస్, విద్యుత్‌తో న‌డిచే వాటిని సైతం త‌యారు చేశారు. కానీ, వాట‌న్నింటికంటే భిన్నంగా ఆలోచించిన ఓ వ్య‌క్తి ఏకంగా బీరుతో న‌డిచే బైక్‌ను క‌నిపెట్టాడు.

గ్యాస్ బ‌దులు బీరు…
ప్ర‌పంచంలో ప్ర‌తిరోజు ఒక కొత్త టెక్నాల‌జీ ప‌రిచ‌యం అవుతోంది. కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు నాంది ప‌లుకుతోంది. నిత్యం వినూత్నంగా ఆలోచించే అమెరికాకు చెందిన మైఖేల్‌సన్‌ పెట్రోల్‌, డీజిల్‌ బదులు బీర్‌తో నడిచే బైక్‌ రూపొందించాడు. తాను నివాసం ఉంటున్న బ్లూమింగ్టన్‌లో రోజురోజు గ్యాస్‌ ధరలు పెరుగడంతో ఆయ‌న‌కు ఏం చేయాలో అర్దం కాలేదు. గ్యాస్ బ‌దులు మ‌రేదైనా కొత్త‌గా ఆలోచించి ఆ ఇంధ‌నంతో బైక్‌ న‌డిపించాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించాడు. బైక్‌లకు సాధారణ ఇంధనాలను వినియోగించడం మంచిది కాదని అందుకే బీరుతో న‌డిచే బైక్‌ రూపొందించిన‌ట్లు మైకెల్‌స‌న్ వెల్ల‌డించారు.

ఈ బైక్ ఎలా ప‌నిచేస్తుందంటే…
బీర్‌తో నడిచే బైక్‌ తన గ్యారేజ్‌లో మైఖేల్‌సన్‌ రూపొందించాడు. గ్యాస్‌ ఆధారిత ఇంజిన్‌ స్థానంలో 14 గ్యాలన్‌ కిట్‌ అమర్చాడు. ఇది హీటింగ్‌ కాయిల్‌గా పనిచేస్తుంది. బీర్‌ వేడెక్కేందుకు ఉపయోగపడుతుంది. ఫలితంగా శక్తి ఉత్పత్తి జరిగి.. బైక్‌ నడుస్తుంది. ఈ బైక్‌ గంటకు 240 కిలోమీట‌ర్ల వేగంతో నడుస్తుందని మైఖేల్‌సన్‌ వెల్లడించారు. భవిష్యత్‌లో ఈ సామర్థ్యాన్ని పెంచాల‌ని భావిస్తున్నట్లు చెప్పారు. కిట్‌లో బీర్‌ పోసినప్పుడు హీటింగ్‌ కాయిల్‌ సాయంతో 300 డిగ్రీల వరకు వేడెక్కుతుంది. ఫలితంగా బీర్‌ కాస్త్ సూపర్‌హీటెడ్‌ స్ట్రీమ్‌గా మారుతుంది. అది వెనుక నాజిల్‌ గుండా బయటకు వస్తుంది. ఆ శక్తి బైక్ ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.

ఈ బైక్‌కు ఎన్నో బ‌హుమ‌తులు..
ఈ బీర్‌తో నడిచే బైక్ ఎన్నో బ‌హుమ‌తులు గెలుచుకుంది. అయితే, అది ఇప్పటివరకు రోడ్డు మీదకు రాలేదు. కొద్ది రోజుల్లోనే వీటిని తయారు చేసి అమ్మ‌నున్నారు. తనకు బీర్‌ తాగే అలవాటు లేదని కానీ దీనినే ఇంధనంగా మార్చి బైక్‌కు వినియోగించాలని ఆలోచన వచ్చినట్లు చెప్పాడు. మూవీ స్టంట్‌, అంతరిక్ష జౌత్సాహికుడైన మైఖేల్‌సన్ కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అనేక ఆవిష్కరణలు చేశారు. మరియు తన ఇంటినే మ్యూజియంగా మార్చుకున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరిన్ని ఆవిష్కరణలు చేస్తాననని మైఖేల్‌సన్‌ వెల్లడించారు. ఇప్పటికే అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించిన తొలి పౌరుడిగా మైఖెల్‌సన్‌ ‘రాకెట్‌మ్యాన్‌గా’ గుర్తింపు పొందాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like