బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ స‌రెండ‌ర్‌

మంచిర్యాల : బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ జంపాలరజిత‌ను స‌రెండ‌ర్ చేసేందుకు కౌన్సిల‌ర్లు అంతా సిద్దం అయ్యారు. అవినీతి ఆరోప‌ణ‌లు, తాము చెప్పిన‌ట్లుగా విన‌క‌పోవ‌డం ప‌లు ర‌కాలైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆమెను స‌రెండర్ చేసేలా తీర్మానం చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్దం చేశారు. శుక్ర‌వారం కౌన్సిల‌ర్లు అంతా ఒక్క‌చోట స‌మావేశం అయ్యి నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే కౌన్సిల్‌లో ఆమెను స‌రెండ‌ర్ చేయ‌నున్నారు.

బెల్లంప‌ల్లి మున్సిపాలిటీ.. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది. తాజాగా కౌన్సిల్లో తీర్మానం చేసి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ను స‌రెండ‌ర్ చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం కూడా సంచ‌ల‌నంగా మారింది. క‌మిష‌న‌ర్ కౌన్సిల‌ర్ల మాట విన‌డం లేద‌ని, చివ‌ర‌కు ఎమ్మెల్యే చెప్పినా ప‌ట్టించుకోని స్థితికి వ‌చ్చింద‌ని కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు వాపోతున్నారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించిన విష‌యాల్లో తాము ఎన్నిమార్లు ఆమె దృష్టికి తీసుకువెళ్లినా క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోతున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో తాము చుల‌క‌న అవుతున్నామ‌ని చెబుతున్నారు. చాలా సంద‌ర్బాల్లో ఎమ్మెల్యే చెప్పినా వాటిని సైతం ప‌క్క‌న పెడుతోంద‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని టీఆర్ఎస్ నేత ఒక‌రు వెల్ల‌డించారు.

ఇక ఆమె అవినీతి విష‌యంలో సైతం ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. డీజిల్ బిల్లుల దుర్వినియోగంతో ల‌క్ష‌ల రూపాయ‌ల గోల్‌మాల్‌, ప్ర‌భుత్వ భూముల్లో ఇండ్లు క‌ట్టుకునేందుకు అనుమ‌తులు ఇచ్చారు. మున్సిప‌ల్ కార్మికుల‌ వేత‌నాలు లేకున్నా, మున్సిప‌ల్ కౌన్సిల్ స‌భ్యుల‌కు సైతం డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి లేన‌ప్ప‌టికీ ల‌క్ష‌ల్లో నిధులు డ్రా చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపించాయి.సింగ‌రేణి క్వార్ట‌ర్ల‌కు ఇంటి నంబ‌ర్లు ఉన్నా, అవి శిథిలావ‌స్థ‌ల‌కు చేరుకున్న‌ట్లు చూపించి అందులో ఉంటున్న వారి వ‌ద్ద రూ.50వేల వ‌ర‌కు తీసుకుని వాటికి ప్ర‌భుత్వ నంబ‌ర్లు కేటాయించి ల‌క్ష‌ల్లో దండుకున్నారని ఫిర్యాదులు సైతం వెళ్లాయి.

ఇలా బెల్లంప‌ల్లి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పై క‌లెక్ట‌ర్‌కు, సీడీఏఎంకు, చివ‌ర‌కు మున్సిప‌ల్ శాఖ క‌మిష‌న‌ర్‌కు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆమె ప‌నితీరు స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో కింది స్థాయి సిబ్బంది సైతం ఇష్టారీతిన ప్ర‌వ‌రిస్తున్నార‌ని సైతం ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, కౌన్సిల‌ర్లు చివ‌ర‌కు చాలా సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు సైతం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అయినా మున్సిప‌ల్ క‌మిష‌నర్ ప‌నితీరు విష‌యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వ‌చ్చే కౌన్సిల్ స‌మావేశంలో తీర్మానం చేసి ఆమెను స‌రెండ‌ర్ చేయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like