పోలీసుల వ‌ల‌యంలో బెల్లంప‌ల్లి, రామ‌గుండం

ప్ర‌తిప‌క్ష నేత‌ల ముంద‌స్తు అరెస్టులు

Minister KTR: మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి, పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం పోలీసుల ప‌టిష్ట బందోబ‌స్తుతో ఖాకీవ‌నంగా మారింది. ఈ రెండు ప‌ట్ట‌ణాల‌ను పోలీసులు త‌మ అదుపులోకి తీసుకున్నారు. ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఆ ప్రాంతాల్లోని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు.

రాష్ట్ర పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రెండు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈ రెండు చోట్ల నిర్వ‌హించే కార్య‌క్ర‌మ స్థ‌లాలు, బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే ప్రాంతాల‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు జిల్లాల్లో ప్ర‌తిప‌క్ష నేత‌లు ముఖ్యంగా బీజేపీ నేత‌ల‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. బెల్లంప‌ల్లిలో బైబై చిన్న‌య్య పేరుతో బీజేపీ నేత‌లు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ప‌లు చోట్ల వీటిని ఏర్పాటు చేయ‌డంతో రాత్రికి రాత్రే వాటిని తొల‌గించిన పోలీసులు బీజేపీ నేత‌ల‌ను అరెస్టు చేశారు.

మంత్రి కేటీఆర్ కాసిపేట మండలం దేవాపూర్‌ గ్రామానికి చేరుకుంటారు. ఓరియంట్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి నేరుగా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ ప్రారంభిస్తారు. మిషన్‌ భగీరథ స్కీంను మంత్రులతో కలిసి ప్రారంభిస్తారు. కాల్‌టెక్స్‌ ఏరియాలోని సనాతన అనాలటిక్స్‌ అండ్‌ రిక్యూట్‌మెంట్‌ సర్వీస్‌ సంస్థను పరిశీలన చేసి వారితో మాట్లాడతారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. సభ అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భోజనం చేసి హెలిక్యాప్టర్‌లో పెద్దపల్లి జిల్లా రామగుండానికి బయలు దేరుతారు.

మ‌ధ్యాహ్నం 2:45 గంటలకు హెలికాప్ట‌ర్‌లో గోదావరిఖనికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించనున్న కేటీఆర్‌, ఆ తర్వాత పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. అనంత‌రం హైద‌రాబాద్‌కు తిరిగి బ‌య‌ల్దేర‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like