భారీ యంత్రాలు 18 గంటలు పనిచేయాలి

సింగ‌రేణి సీఅండ్ఎండీ శ్రీ‌ధ‌ర్ వెల్ల‌డి

మంచిర్యాల : ఓపెన్‌ కాస్టు గనుల్లో భారీ యంత్రాల పనితీరు బాగా మెరుగుపడాలని, రోజుకు కనీసం 18 గంటల పాటు వినియోగించాలని సింగ‌రేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సింగరేణి భవన్ లో సిహెచ్‌పీలు, బొగ్గు రవాణా, భారీ యంత్రాలతో జరుగుతున్న ఉత్పత్తి, పనిగంటలు తదితర అంశాలపైనా ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రస్తుతం భారీ యంత్రాలు సగటున రోజుకు కేవలం 13 నుండి 14 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయన్నారు. పోటీ మార్కెట్‌ లో నిలబడాలంటే ప్రైవేట్‌ కంపెనీల కన్నా మెరుగైన పనితీరు చూపించాల‌ని చెప్పారు. లేదంటే అనేక ప్రభుత్వ కంపెనీల మాదిరిగానే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. భారీ యంత్రాల వినియోగం పెంచడం కోసం కార్మికులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ చైతన్యం చేయాల‌న్నారు. కార్మికులు కూడా మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకొని సామర్థ్యం మేరకు యంత్రాలను వినియోగించాలని కోరారు.

సింగరేణి సంస్థ, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్తగూడెం – సత్తుపల్లి రైల్వే లైను వచ్చే మార్చి నెల కల్లా పూర్తిచేయాలని ఆదేశించారు సత్తుపల్లి వద్ద దీనికి సంబంధించిన రైల్వే సైడింగ్‌ కూడా ఫిబ్రవరి నాటికి బొగ్గు రవాణాకు సిద్ధం చేయాల‌న్నారు. సత్తుపల్లి లోని సింగరేణి ఓపెన్‌ కాస్టు గనుల నుంచి బొగ్గు రవాణా కోసం వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే మార్గ నిర్మాణం పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. దీనికి సంబంధించిన పనుల పురోగతి ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. 52 కిలోమీటర్ల పొడవు గల ఈ రైలు మార్గంలో ఇప్పటికే అధిక శాతం పనులు పూర్తయ్యాయని, కొంతమేర ట్రాక్‌ పరీక్షలు కూడా నిర్వహించిన‌ట్లు అధికారులు తెలిపారు. మిగిలి ఉన్న పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని శ్రీ‌ధ‌ర్‌ ఆదేశించారు.

రైల్వే లైన్‌ నుంచి సత్తుపల్లి మెగా సీహెచ్‌పీని కలుపుతూ నిర్మించే 10 కిలోమీటర్ల రైల్వే సైడింగ్‌ పనులు కూడా ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సత్తుపల్లి నుంచి రైలు మార్గం ద్వారా పర్యావరణ హితంగా బొగ్గు రవాణా జరపాల్సి ఉంటుందని సూచించారు. సత్తుపల్లి వద్ద సింగరేణి సంస్థ నిర్మిస్తున్న అతిపెద్ద పర్యావరణహిత సీహెచ్‌ పీ నిర్మాణపు పనులు కూడా ఫిబ్రవరి చివరి కల్లా పూర్తి చేయాలని కోరారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నిర్మించతలపెట్టిన వీకే 7 సీహెచ్‌ పీ, 6 సీహెచ్‌పీ, ఆర్జీ-2 ఏరియా, దేవాపూర్‌ సమీపంలో కెకె ఓసీ వద్ద నిర్మించనున్న వార్ఫ్‌ లోడింగ్‌ సీహెచ్‌పీల ప్రతిపాదనలకు సంబంధించిన టెండర్లను పూర్తి చేసి వచ్చే ఏడాది నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌.చంద్రశేఖర్‌ , డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, పిఅండ్‌పి, పర్సనల్‌) బలరామ్‌, డైరెక్టర్‌ (ఇ అండ్‌ ఎం) డి.సత్యనారాయణ రావు, అడ్వైజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌ ఈ డీ (కోల్‌ మూమెంట్‌) జె.ఆల్విన్‌, జీఎం (కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ, జీఎం (సీపీపీ) నాగభూషణ్‌ రెడ్డి, జీఎం (మార్కెటింగ్‌) రవిశంకర్‌, జీఎం (సిఎమ్‌సి) రామచందర్‌, జీఎం (స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌) జి.సురేందర్‌, జీఎం (సివిల్‌) రమేష్‌ బాబు, జీఎం (సిహెచ్‌పి లు) స్వామినాయుడు, జీఎం (ఓసీపి లు) గోపాల క్రిష్ణ మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like