భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ సీఈవోగా సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్.. 2011 అక్టోబర్‌లో ట్విట్టర్‌లో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ట్విట్టర్‌లో చేరక ముందు.. ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, యాహూలో పనిచేశారు. ఆ తరువాత ట్విట్టర్‌లో జాయిన్ అయి.. ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ అండ్ సైన్స్ టైమ్‌లకు బాధ్యతలు వహించారు. ఇప్పుడు.. సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

భారత్‌లో పుట్టిన పెరిగిన పరాగ్ అగర్వాల్ బాంబే ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత యూఎస్ వెళ్లి కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చేరారు. యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఆ తరువాత మైక్రోసాఫ్ట్, యాహూ వంటి పలు కీలక ఐటీ కంపెనీలలో సేవలు అందించారు. అటు నుంచి ట్విట్టర్‌లో చేరారు. 2011లో ట్విట్టర్‌లో చేరగా.. 2019 డిసెంబర్‌లో పరాగ్ అగర్వాల్‌ను ప్రాజెక్టు బ్లూ స్కూ అనే ఇండిపెండెంట్ టీమ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమితుడైయ్యారు.

ప్రస్తుతం ట్విట్టర్‌ సీఈవో జాక్ డోర్సీ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖను ట్వీట్ చేశాడు. దాదాపు 16 ఏళ్ల పాటు ట్విట్టర్‌లో పని చేసిన ఆయన.. సంస్థతో తనకున్న అనుబంధాన్ని తన రాజీనామా లేఖలో వివరించారు. సహ వ్యవస్థాపకుడి స్థాయి నుంచి సిఈఓ వరకూ తన అనుభవాలను లేఖలో పేర్కొన్నారు. అలాగే.. కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికపైనా కీలక ప్రస్తావన చేశారు. ట్విటర్‌లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్న పరాగ్ అగర్వాల్ కొత్త సిఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారని, కొత్త సిఈఓగా పరాగ్ అగర్వాల్‌‌ను తాను కూడా సమర్థిస్తున్నట్లు డోర్సీ తన లేఖలో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like